Share News

స్మార్ట్‌ఫోన్‌ ధరలకు రెక్కలు!

ABN , Publish Date - Nov 06 , 2026 | 04:39 AM

జెమిని, చాట్‌జీపీటీ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సాంకేతికత ప్రపంచాన్ని శాసిస్తోంది నిజమే.

స్మార్ట్‌ఫోన్‌ ధరలకు రెక్కలు!
smart phones

  • ఏఐ హవాతో బడ్జెట్‌ ఫోన్లపై భారం

  • 30శాతం దాకా ధరలు పెరిగే అవకాశం

  • మూడు రెట్లు పెరిగిన చిప్‌ల ధరలు

  • రూ.16వేల లోపు ఫోన్ల తయారీపై

  • తీవ్ర ప్రభావం: జెఫరీస్‌ నివేదిక

న్యూఢిల్లీ, నవంబరు 5: జెమిని, చాట్‌జీపీటీ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సాంకేతికత ప్రపంచాన్ని శాసిస్తోంది నిజమే.. కానీ ఆ ఏఐ మోజు ఇప్పుడు నేరుగా సగటు వినియోగదారుడి జేబుకు కన్నం పెట్టనుంది!. కొత్తగా స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలు చేయాలని ఆశపడే వారిపై రాబోయే రోజుల్లో భారీగా ఆర్థిక భారం పడబోతోంది. ఇప్పటికే వివిధ కారణాలతో రెండు సార్లు పెరిగిన ధరలు.. ఇప్పుడు మరోసారి భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలో లభించే ఆండ్రాయిడ్‌ ఫోన్ల ధరలు మరో 30శాతం వరకు పెరిగే ప్రమాదం ఉందని ప్రముఖ గ్లోబల్‌ రిసర్చ్ సంస్థ జెఫరీస్‌ వెల్లడించింది. ఏఐ సాంకేతికతకు అవసరమైన ప్రాసెసర్‌, మెమరీ చిప్‌లకు డిమాండ్‌ విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. 2027 నాటికి మెమరీ చిప్‌ల సప్లైలో 60శాతం వాటా ఏఐ రంగమే వినియోగించుకోవచ్చని తెలిపింది. డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాల కోసం టెక్‌ కంపెనీల నుంచి మెమరీ చిప్స్‌కు విపరీతమైన గిరాకీ ఏర్పడటంతో మార్కెట్లో వీటికి తీవ్ర కొరత ఏర్పడుతోంది. నిన్నమొన్నటి దాకా ఒక మెమరీ యూనిట్‌ ధర 20 డాలర్లు(సుమారు రూ.1680) ఉండగా, ప్రస్తుతం అది ఏకంగా 60నుంచి 65 డాలర్లకు(సుమారు రూ. 5000), అంటే మూడు రెట్లు పెరిగిపోయింది.


దీని ప్రభావం ముఖ్యంగా 200డాలర్ల లోపు (సుమారు రూ.16వేలు) లభించే బడ్జెట్‌ ఫోన్ల ఉత్పత్తి వ్యయంపై పడుతోంది. అందుబాటు ధరల్లో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌ తయారీకి అయ్యే మొత్తం ఖర్చులో మెమరీ చిప్‌ల వాటానే 60శాతం దాకా ఉంటుంది. దీంతో భారాన్ని నేరుగా కొనుగోలుదారులపై వేసేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. జెఫరీస్‌ అంచనా ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్‌లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉండే బడ్జెట్‌ సెగ్మెంట్‌ వాటా తీవ్రంగా పడిపోనుంది. ఖరీదైన ప్రీమియం ఫోన్ల వాటా 29-38శాతానికి పెరుగుతుందని పేర్కొంది. కాగా, ఈ రకమైన తయారీ ఖర్చులను తగ్గించుకోవడానికి మొబైల్‌ కంపెనీలు సరికొత్త దారులు వెతుక్కుంటున్నాయి. కొత్తగా వచ్చే ఫోన్లలో తాజా ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌లకు బదులుగా, ఒకటి రెండేళ్ల పాత చిప్‌లను వాడటంపై ఆలోచిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

దీపావళి వేళ రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్..

అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే డెడ్‌లైన్ మొదలు.. సుప్రీం కోర్టు స్పష్టత

Updated Date - Nov 06 , 2026 | 04:43 AM