ముందు చేసేయాలి.. ఆ తర్వాతే అందరికీ చెప్పాలి: శుభాంశు శుక్లా
ABN , Publish Date - Jun 28 , 2026 | 06:55 PM
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఏడాది తర్వాత, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తన అంతరిక్ష ప్రయాణ అనుభవాలపై 'ది సెకండ్ ఆర్బిట్'అనే పుస్తకాన్ని రచించారు. ఇందులో ఎన్నో ఆశ్చర్యకమైన విషయాలను ఆయన గుర్తుచేసుకున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 28: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఏడాది తర్వాత, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తన అంతరిక్ష ప్రయాణ అనుభవాలపై 'ది సెకండ్ ఆర్బిట్' (The Second Orbit) అనే పుస్తకాన్ని రచించారు. అమెరికాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ‘ఆక్సియమ్-4’ (Axiom-4) మిషన్ నింగిలోకి లేచిన సరిగ్గా ఏడాది తర్వాత, జూన్ 25న ఈ పుస్తకం విడుదలైంది.
అంతరిక్ష యాత్ర కోసం ఎంపిక ప్రక్రియకు దరఖాస్తు చేసుకునేటప్పుడు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తన భార్యకు ఆ విషయం చెప్పలేదు. అంతకుముందు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) ప్రవేశ పరీక్ష రాసేటప్పుడు కూడా తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. సైన్యంలో చేరడానికి ఆయన మొదటిసారి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు బయలుదేరినప్పుడు, ఆయన తండ్రి కేవలం నాలుగే నాలుగు ముక్కలు చెప్పారు.. 'నీకు వెళ్లాలని ఉంటే, వెళ్లు' అని.
ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 'ఏదైనా విషయాన్ని ముందే అందరికీ చెప్పడం కంటే, ముందుగా దాన్ని సాధించి, ఆ తర్వాత చెబితే పనులు మరింత సులభమవుతాయని నా భావన' అని తన మనసులోని మాటను పంచుకున్నారు.
ఈ పుస్తకంలో కేవలం అంతరిక్ష సాంకేతిక విషయాలే కాకుండా, తన ఎంపిక గురించి తెలిసినప్పుడు తన భార్య ఎలా స్పందించింది, ఏడాది పాటు కుటుంబానికి దూరంగా ఉండటంలోని బాధ, మొదటిసారి నాసా(NASA)లోకి అడుగుపెట్టినప్పుడు కలిగిన అనుభూతి వంటి మానవీయ కోణాలను కూడా తన పుస్తకంలో రాశారు. గతంలో అంతరిక్షంలోకి వెళ్లిన వారి సలహాతో తాను రాసుకున్న డైరీలు, ఆడియో నోట్స్ ఈ పుస్తక రచనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన తెలిపారు.
అంతరిక్షం నుంచి భూమిని చూసినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేమన్నారు. 'పైనుంచి చూసినప్పుడు భూమిపై ఎలాంటి సరిహద్దులు, దేశాలు కనిపించవు. ఇదంతా ఒకే ఒక్క ఇల్లు అనే భావన సహజంగానే కలుగుతుంది. భవిష్యత్తులో మనకు ఎవరైనా గ్రహాంతరవాసి(Alien) ఎదురైతే, మనం భూమికి చెందినవాళ్లమనే పరిచయం చేసుకుంటాం తప్ప.. దేశాల పేర్లు చెబితే వాళ్లకు అర్థం కాదు' అని శుక్లా పేర్కొన్నారు. అంతేకాదు, మరో భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడానికి మళ్లీ 41 ఏళ్లు పట్టదు. చాలా త్వరగతినే ఆ సమయం రాబోతోందని గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
మళ్లీ యుద్ధం మొదలవుతోందా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..
కరాచీలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి..