Share News

ఇది రాజకీయాలకు ఆవల మరో కోణం.. ‘బిలాంగింగ్‌’పై ఎంపీ శశిథరూర్ వ్యాఖ్య

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:40 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఆత్మకథపై ఎంపీ శశిథరూర్ తాజాగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఇది రాజకీయాలకు ఆవల మరో కోణం.. ‘బిలాంగింగ్‌’పై ఎంపీ శశిథరూర్ వ్యాఖ్య
Shashi Tharoor

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్‌‘ పై ఎంపీ శశిథరూర్ తాజాగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ పుస్తకం రాజకీయాలకు ఆవల ఓ వ్యక్తి మనసులోని మరో కోణాన్ని ఆవిష్కరించిందని అన్నారు. రాజకీయ సంచలనాల కోసం పుస్తకాన్ని జల్లెడ పడుతున్న వారికి కాస్త నిరాశ తప్పదని కామెంట్ చేస్తూ జాతీయ మీడియాలో ఓ వ్యాసం రాశారు. ఈ పుస్తకం తన వ్యక్తిగత జ్ఞాపకాలకు అక్షరరూపమన్న విషయాన్ని ముందుమాటలోనే ఎంపీ సోనియా స్పష్టం చేశారని చెప్పారు. ఇందుకు తగ్గట్టుగానే సాధారణ రాజకీయ బయోగ్రఫీలకు భిన్నంగా మనసును తాకేలా పుస్తకం సాగిందని చెప్పారు.


ఇటలీలోని ఓ టౌన్ నుంచి భారత్‌ను తన శాశ్వత నివాసం చేసుకునే స్థితివరకూ ఎదుర్కొన్నే అనేక అనుభవాలను ఎంపీ సోనియా గాంధీ పుస్తకంలో పొందుపరిచారని ఎంపీ శశిథరూర్ చెప్పారు. సోనియా గాంధీకి చిన్నతనంలో సంప్రదాయకవాది అయిన తండ్రితో గల సంక్లిష్ట బంధం, రాజీవ్ గాంధీతో పెళ్లికి ఆయన అభ్యంతరం చెప్పడం, ఆ తరువాత తన ఇంటి తలుపులు కూతురి కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న తండ్రి వ్యాఖ్య వంటివన్నీ పాఠకుల మనసుల్ని తాకుతాయని శశి థరూర్ వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధీపై తనకున్న ప్రేమను పుస్తకంలో నిజాయతీతో పంచుకున్న తీరుఎంతటి కఠిన హృదయాల్ని అయినా కదిలిస్తుందని వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీ రోజువారీ జీవితానికి అలవాటు పడే సమయంలో ఎదురైన అనుభవాలను సోనియా తన పుసక్తంలో కళ్లకు కట్టినట్టు వివరించారని చెప్పారు.


తన కుటుంబ జీవితానికి సంబంధించి ఇంతవరకూ బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను మనసుకు హత్తుకునేలా పంచుకున్నారని శశి థరూర్ చెప్పారు. తమ కుటుంబానికి పెద్దదిక్కుగా, సంరక్షకురాలిగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీకున్న మరో కోణాన్ని కూడా పరిచయం చేశారని చెప్పారు. తొలి సంతానం కొద్ది కాలంలోనే మరణించిన వైనం తనను, రాజీవ్ గాంధీని ఎంతగా కలిచివేసిందో కళ్లకు కట్టినట్టు సోనియా వివరించారని శశి థరూర్ చెప్పారు. గెలుపోటముల రాజకీయ ప్రపంచానికి భిన్నంగా తన జీవితంలోని ఓ కొత్త కోణాన్ని చూపించారని శశి థరూర్ చెప్పారు. అదే సమయంలో తన ప్రైవెసీకి ఎంతటి ప్రాధాన్యం ఇచ్చేది కూడా సోనియా స్పష్టంగా చెప్పారని అన్నారు.


రాజకీయ అంశాలు కూడా ఈ పుస్తకంలో అనివార్యంగా తొంగి చూశాయని కూడా ఎంపీ శశిథరూర్ అభిప్రాయపడ్డారు. 1975 ఎమర్జెన్సీ ఓ మిస్టేక్ అని సోనియా పుస్తకంలో చెప్పారని శశిథరూర్ అన్నారు. అయినప్పటికీ ఇందిరా గాంధీ ఓ ప్రజాస్వామికవాది అని కూడా స్పష్టం చేశారు. మనేకా గాంధీతో ఎడం పెరగడం వంటి అనేక విషయాలను పంచుకున్నారని చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్న తనకు భగవద్గీత చదివాక తన బాధ్యతపై దృష్టిపెట్టిన వైనాన్ని కూడా సోనియా పుస్తకంలో చెప్పారు. 2004లో ప్రధాని పదవిని కాదనుకోవడం, నాయకత్వ మార్పుపై ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు, సంజయ్ బారు పుస్తకం ది యాక్సిడెంటల్ ప్రైమినిస్టర్ వంటి ఆసక్తికర విషయాలని శశి థరూర్ వ్యాఖ్యానించారు. కొన్ని విషయాల్లో సోనియా పాటించిన మైనం కూడా ఎన్నో విషయాలను తెలియజేసిందని వ్యాఖ్యానించారు. ప్రేమ కోసం ఖండాంతరాలు దాటొచ్చి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఓ మహిళ మనోగతం పుస్తకంలో ఆవిష్కృతమైందని శశిథరూర్ చెప్పారు. సంచల రాజకీయ అంశాల కోసం పుస్తకాన్ని జల్లెడపట్టేవారికి మాత్రం స్వల్ప నిరాశ తప్పదని ముక్తాయించారు.


ఈ వార్తలనూ చదవండి:

ప్రధానితో నా బంధం రాజకీయాలకు అతీతమైంది: సామ్ పిట్రోడా

నగ్న ఫొటోలు పంపిన పాక్ యువతి.. ఐఏఎఫ్ రహస్యాలు లీక్..!

Updated Date - Nov 14 , 2026 | 01:12 PM