Share News

షహజాద్ భట్టి నెట్‌వర్క్‌‌ను ఉగ్రవాద సంస్థగా కేంద్రం ప్రకటన

ABN , Publish Date - Sep 16 , 2026 | 04:37 PM

షహజాద్ భట్టి నెట్‌వర్క్‌‌ను (SBN) కేంద్రం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. UAPA చట్టం కింద ఎస్‌బీఎన్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలోకి హోం శాఖ చేర్చింది.

షహజాద్ భట్టి నెట్‌వర్క్‌‌ను ఉగ్రవాద సంస్థగా కేంద్రం ప్రకటన
SBN Declared as terrorist Organization

ఇంటర్నెట్ డెస్క్: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌‌ను (SBN) కేంద్రం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. UAPA చట్టం కింద ఎస్‌బీఎన్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలోకి హోం శాఖ చేర్చింది. యూఏపీఏ చట్టంలోని సెక్షన్ 35(1)(a) కింద ఈ చర్య తీసుకుంది. యూఏపీఏ చట్టంలోని మొదటి షెడ్యూల్‌లో 46వ సంస్థగా షహజాద్ భట్టి నెట్‌వర్క్ చేరింది.

ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ఎస్‌బీఎన్ పాల్పడుతున్నట్లు కేంద్రం ఆరోపించింది. యువతను ఉగ్రవాద కార్యకలాపాల వైపు ఆకర్షిస్తోందని పేర్కొంది. ఇతర నిషేధిత సంస్థలతో కూడా ఎస్‌బీఎన్‌కు సంబంధాలున్నాయని కేంద్రం వెల్లడించింది. హింసాత్మక కార్యకలాపాలతో ఎస్‌బీఎన్ ప్రజాశాంతికి విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించింది. సోషల్ మీడియా, డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రెచ్చగొట్టే సందేశాలు వ్యాప్తి చేస్తోందని కూడా పేర్కొంది.


షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయని హోంశాఖ పేర్కొంది. యూఏపీఏతో పాటు ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద కేసులు నమోదయ్యాయని పేర్కొంది. వలసల చట్టం కింద కూడా కేసులు నమోదైనట్టు పేర్కొంది.

గతనెలలోనే ఎస్‌బీఎన్‌పై 14 రాష్ట్రాల్లో భద్రతా సంస్థలు భారీ ఆపరేషన్‌ను నిర్వహించాయి. సంస్థకు చెందిన 253 మందిని అదుపులోకి తీసుకున్నాయి. ఎస్‌బీఎన్‌పై 80కి పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది. నిందితుల నుంచి ఐఈడీలు, పిస్టళ్లు, లైవ్ కార్ట్రిడ్జ్‌లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది.

ఇటీవల బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఎస్‌బీఎన్‌ నుంచి ముప్పు ఉండవచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు కూడా చేశాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఎస్‌బీఎన్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలోకి చేర్చింది.


ఈ వార్తలనూ చదవండి:

యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్‌ ఆరోపణలు.. తోసిపుచ్చిన కేంద్రం

విధులకు హాజరుకాకుండానే నెలకు రూ.70 వేల జీతం.. కర్ణాటక ఎమ్మెల్యే మేనకోడలికి నోటీసు

Updated Date - Sep 16 , 2026 | 04:37 PM