మెల్‌బోర్న్ పర్యటనకు ముందు ప్రధాని మోదీకి డెత్ వార్నింగ్
ABN , Publish Date - Jul 04 , 2026 | 07:01 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు వచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు వచ్చాయి. మెల్‌బోర్న్ మీట్స్ మోదీ పేరిట జరగనున్న ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల ప్రమోషన్ కోసం ఉద్దేశించిన ఒక ఫేస్ బుక్ పోస్టుకు కామెంట్ రూపంలో నిందితులు ఈ బెదిరింపులకు దిగారు. అబూ ముస్తాఫా పేరిట ఉన్న అకౌంట్ నుంచి నిందితులు ఈ పోస్టు పెట్టారు. ‘స్టేడియం రూఫ్‌టాప్‌ను మూసేస్తే మంచిది. ఈ కార్యక్రమానికి మోదీ రావడమంటే మృత్యువు కోసం వస్తున్నట్టే’ అని కామెంట్ చేశారు.
ఈ ఘటనపై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఏ ఐపీ అడ్రస్ నుంచి ఈ పోస్టు వచ్చిందో గుర్తించారు. అయితే, ఈ ఉదంతంలో ఎవరినైనా అరెస్టు చేశారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనను తీవ్రంగా పరగణిస్తున్నామని ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి.
ఇక ప్రధాని మోదీ జులై 8-10 మధ్య ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. జులై 9న మెల్‌బోర్న్ మీట్స్ మోదీ ఈవెంట్‌లో పాల్గొంటారు. ఈ పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియా-ఇండియా వార్షిక సమావేశంలో కూడా మోదీ పాల్గొంటారు. ఈ సమావేశాల గురించి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ ఆల్బనీస్ ప్రకటించారు. భారత్ ఆస్ట్రేలియాకు గొప్ప వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామి అని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
కేతన్ మర్డర్ తర్వాత సైన్ లాంగ్వేజ్‌లో సియా, చేతన్ చాటింగ్..
అయోధ్యలో విరాళాల లెక్కింపు.. అమల్లోకి కఠిన నిబంధనలు..