సీల్డ్‌కవర్ విధానం అవసరమా?
ABN , Publish Date - Aug 03 , 2026 | 05:32 AM
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి న్యాయవ్యవస్థలో పారదర్శకత అత్యంత ఆవశ్యకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలో సీల్డ్ కవర్ విధానాన్ని...
‘జాతీయ భద్రత’ పేరిట ఆ విధానాన్ని సమర్థించుకుంటున్నారు
ఒక పక్షానికి సమాచారం అందకుండా చేస్తున్నారు
ఆ విధానాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది
అరుదైన, అసాధారణ కేసుల్లోనే రహస్య విచారణ జరపాలి
మిగతా కేసులన్నింటిలో బహిరంగ విచారణ చేయాలి
అప్పుడే ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం: జస్టిస్ ఉజ్జల్ భుయాన్
న్యూఢిల్లీ, ఆగస్టు 2: ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి న్యాయవ్యవస్థలో పారదర్శకత అత్యంత ఆవశ్యకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలో సీల్డ్ కవర్ విధానాన్ని ప్రశ్నించిన ఆయన.. ఆ విధానం ద్వారా ఒక పక్షానికి సమాచారం అందకుండా దాచిపెడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ’’ సంస్థ రూపొందించిన ఓ నివేదిక విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పారదర్శకత వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల పర్యవేక్షణ సాధ్యమవుతుందని.. తద్వారా న్యాయవ్యవస్థ స్వతంత్రత, నిష్పాక్షికత, సామర్థ్యం మరింత బలోపేతమవుతాయని పేర్కొన్నారు. పారదర్శకత దిశగా న్యాయవ్యవస్థ ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ.. చేయాల్సిన పని ఇంకా చాలా ఉందని, కోర్టుల్లో ఇంకా కొనసాగుతున్న సీల్డ్‌కవర్ విధానాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జాతీయ భద్రతను సాకుగా చూపుతూ కేసులోని ఒక పక్షానికి కొన్ని వివరాలు వెల్లడించకుండా ఆపుతున్నారని జస్టిస్ భుయాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అలా చేయడం.. చట్టం ముందు అందరూ సమానమే అన్న ఆర్టికల్ 14ను ఉల్లంఘించడం కాదా? కోర్టులో మీరు ఉభయపక్షాలనూ సమదృష్టితో చూడట్లేదు. ఇద్దరికీ సమాన అవకాశాలు ఇవ్వట్లేదు’’ అని పేర్కొన్నారు. ‘‘పారదర్శకతే పునాదిగా పనిచేసే న్యాయవ్యవస్థలో ఇలాంటి విధానానికి ఇంకా స్థానం ఉందా’’ అని ప్రశ్నించారు. పారదర్శకత్వం పరంగా గడిచిన దశాబ్దకాలంలో కనిపించిన అత్యంత స్పష్టమైన పురోగతి.. కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారమేనని జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు. అయితే.. ఈ ప్రత్యక్ష ప్రసారాల క్లిప్‌లను అనధికారికంగా కత్తిరించడం, ఎడిట్ చేయడం, సర్క్యులేట్ చేయడంపై సుప్రీంకోర్టు ఇటీవల విధించిన ఆంక్షల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇలాంటి పరిణామాలను ఆంగ్ల న్యాయ కోవిదుడు జెరెమీ బెంథామ్ గతంలోనే ఊహించారని పేర్కొన్నారు. ‘‘బెంథామ్ ఊహించినట్టుగానే.. వాదనల సమయంలో న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను, తుది తీర్పులు కాని మాటలను సందర్భంతో సంబంధం లేకుండా విడివిడిగా ముక్కలుగా తీసుకుని సంచలనాత్మక శీర్షికలతో ప్రచారం చేస్తున్నారు. ఇది న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కక్షిదారులకు తీవ్ర పరువునష్టం కలిగించడమే కాక.. అసలు కోర్టులో ఏం జరిగిందో ప్రజలకు తప్పుగా అర్థమయ్యేలా చేస్తోంది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన ఆంక్షల ఉత్తర్వు ప్రత్యక్ష ప్రసారాలకు వ్యతిరేకంగా ఇచ్చింది కాదు. అది విచారణలో పారదర్శకతకు.. ఆ విచారణ నుంచి తప్పుదోవ పట్టించే కథనాలను తయారుచేసే స్వేచ్ఛకు మధ్య తేడాను స్పష్టంగా చూపే ఉత్తర్వు’’ అని వివరించారు.
ఆస్తులు వెల్లడించడంపై..
విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా.. న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించడం సమర్థనీయమేనన్న మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయాన్ని జస్టిస్ భుయాన్ ప్రస్తావించారు. జడ్జీల ఆస్తుల వివరాలు వారి వ్యక్తిగత సమాచారమని, దానికి ప్రజా కార్యకలాపాలతోగానీ, ప్రజా ప్రయోజనాలతోగానీ ఎలాంటి సంబంధమూ లేదని చెప్పడం సమంజసం కాదని పేర్కొన్నారు. బహిరంగ న్యాయ విచారణ అనే భావనకు భారత న్యాయవ్యవస్థలో ఇప్పటికే తగిన గుర్తింపు లభించిందన్నారు. ‘‘సాధారణంగా కోర్టు ముందుకు వచ్చే సివిల్, క్రిమినల్ లేదా ఏ ఇతర కేసులైనా వాటిపై విచారణ కోర్టుల్లో బహిరంగంగానే జరగాలి. నిష్పాక్షక న్యాయప్రక్రియకు అది అత్యంత అవసరం’’ అంటూ గతంలో మాజీ సీజేఐ జస్టిస్ పీబీ గజేంద్ర గడ్కర్ ఇచ్చిన తీర్పును కూడా జస్టిస్ భుయాన్ ఉటంకించారు. ఈ పారదర్శకతే ప్రజలకు న్యాయపరిపాలనపై నమ్మకాన్ని పెంపొందిస్తుందన్నారు. ‘‘అత్యంత అరుదైన, అసాధారణ కేసుల్లో మాత్రమే.. మూసిన తలుపుల వెనుక కోర్టు రహస్య విచారణ జరపవచ్చు లేదా కేసు పెండింగ్‌లో ఉన్నంతకాలం విచారణ వివరాల ప్రచురణను నిషేధించవచ్చు’’ అని స్పష్టం చేశారు. అలాంటి అసాధారణ సందర్భాల్లో మినహా.. కోర్టు విచారణలన్నీ ప్రజలకు బహిరంగంగా అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలు న్యాయమూర్తుల ప్రవర్తనను, విచారణ ప్రక్రియలను, కేసుల ఫలితాలను నేరుగా గమనించగలుగుతారని.. న్యాయవ్యవస్థపై వారు ఒక సరైన అవగాహనకు రావడానికి ఇది వీలు కల్పిస్తుందని జస్టిస్ భుయాన్ అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..
వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..