Share News

సల్మాన్ ఖాన్ తండ్రికి అనారోగ్యం.. ఆస్పత్రికి తరలింపు..

ABN , Publish Date - Feb 17 , 2026 | 03:37 PM

సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ మంగళవారం అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయన్ను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. సలీమ్ అనారోగ్యం గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు, సన్నిహితులు ఒక్కొక్కరుగా ఆస్పత్రికి చేరుకుంటున్నారు..

సల్మాన్ ఖాన్ తండ్రికి అనారోగ్యం.. ఆస్పత్రికి తరలింపు..
Salim Khan

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ మంగళవారం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సలీమ్ ఖాన్‌కు చికిత్స అందిస్తున్నారు. సలీమ్ ఖాన్ అనారోగ్యానికి గల కారణం ఏంటన్నది తెలియరాలేదు. కుటుంబసభ్యులు కూడా ఈ విషయంపై స్పందించలేదు. సలీమ్ అనారోగ్యం గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు, సన్నిహితులు ఒక్కొక్కరిగా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ కూడా తండ్రిని చూడ్డానికి ఆస్పత్రికి వెళ్లారు.


తండ్రిని చూసిన తర్వాత ఆస్పత్రి నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఆయనను పలకరించడానికి ప్రయత్నించారు. సల్మాన్ మాత్రం స్పందించకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు. సల్మాన్ కుటుంబసభ్యులు ఆస్పత్రికి దగ్గరకు వచ్చిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సలీమ్ చిన్న కూతురు అల్వీరా అగ్నిహోత్రి.. అల్లుడు ఆయుష్ శర్మ (పెంపుడు కూతురు అర్పిత భర్త) తమ తమ వాహనాల్లో ఆస్పత్రి దగ్గరకు వచ్చారు.


బాలీవుడ్‌లో టాప్ స్క్రీన్ రైటర్..

సలీమ్ ఖాన్‌కు స్క్రీన్ రైటర్‌గా బాలీవుడ్‌లో మంచి పేరుంది. ఆయన ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలకు రైటర్‌గా పని చేశారు. మరో ప్రముఖ రచయిత జావెద్ అక్తర్‌తో కలిసి ఎన్నో కల్ట్ సినిమాలకు పని చేశారు. షోలే, దీవార్, జంజీర్, డాన్ లాంటి కథల్ని అందించారు. వీరిద్దరూ 12 ఏళ్ల పాటు కలిసి పని చేశారు. ఇక సలీమ్ ఖాన్ కుటుంబం విషయానికి వస్తే.. సలీమ్ 1964లో సుశీల చరక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పిల్లలే సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్‌, అల్వీరా, అర్పిత(పెంపుడు కూతురు).


ఇవి కూడా చదవండి..

భర్తను అమ్మేసిన భార్య.. అతడి ప్రియురాలి దగ్గర్నుంచి ఎంత డబ్బు వసూలు చేసిందంటే..

ఈమె తల్లేనా.. కన్న బిడ్డను నడిరోడ్డుపై దారుణంగా..

Updated Date - Feb 17 , 2026 | 04:38 PM