రామజన్మ భూమి ట్రస్టు నుంచి వైదొలగిన భయ్యాజీ
ABN , Publish Date - Aug 04 , 2026 | 05:53 AM
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టులో మరో కీలక పరిణామం జరిగింది. ట్రస్టు పాలకుడి పదవి నుంచి ఆరెస్సెస్ సీనియర్ నేత సురేశ్ భయ్యాజీ జోషి వైదొలిగారు. ఆయన వయస్సు...
అనారోగ్య కారణాల వల్లనే అని ఆరెస్సెస్ సీనియర్ నేత సురేశ్ భయ్యాజీ జోషి వెల్లడి
తప్పుకోవాలని సంఘ్ పెద్దలే కోరినట్లు మరో ప్రచారం
న్యూఢిల్లీ, ఆగస్టు 3: అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టులో మరో కీలక పరిణామం జరిగింది. ట్రస్టు పాలకుడి పదవి నుంచి ఆరెస్సెస్ సీనియర్ నేత సురేశ్ భయ్యాజీ జోషి వైదొలిగారు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. అనారోగ్య కారణాలతో ట్రస్టు బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ఆయన వెల్లడించారు. అయోధ్యలో విరాళాల చోరీ వివాదం నేపథ్యంలో సురేశ్ భయ్యాజీ ట్రస్టు బాధ్యతల నుంచి వైదొలగడం గమనార్హం. అయితే, సురేశ్ భయ్యాజీ స్వచ్ఛందంగా ట్రస్టు నుంచి వైదలగొలేదని, ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందిగా ఆరెస్సెసే సూచించిందని కూడా ప్రచారం జరుగుతోంది. విరాళాల చోరీ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. సురేశ్ భయ్యాజీ 2009 నుంచి 2021వరకు ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రామాలయం నిర్మాణానికి భూముల కొనుగోళ్ల సమయంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన్ను ట్రస్టు పాలకుడిగా నియమించారు. ఆ పదవి నిజానికి అలంకారప్రాయమైది. ట్రస్టు రోజువారీ నిర్వహణలో పాలకుడి జోక్యం ఉండదు. అయితే, ట్రస్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఆయన చేత రాజీనామా చేయించిందనే వాదన వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..