మధ్యప్రదేశ్ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ..
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:26 PM
మధ్యప్రదేశ్ నుంచి మూడు రాజ్యసభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థులు రజనీశ్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేశ్ కేవత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
భోపాల్: మధ్యప్రదేశ్ నుంచి మూడు రాజ్యసభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థులు రజనీశ్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేశ్ కేవత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. గెలుపొందిన అభ్యర్థులకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల అధికారులు ధృవీకరణ పత్రాలను అందజేశారు. అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకోవడానికి నేడే(జూన్ 11) చివరి రోజు. అయితే, ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైన తర్వాత ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నటరాజన్‌పై తెలంగాణలో క్రిమినల్ కేసు నమోదు అయ్యిందని.. ఆ విషయాన్ని నామినేషన్ పత్రాల్లో ఆమె వెల్లడించలేదని బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవత్ ఆరోపించారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులు తమ అఫిడవిట్‌లో అన్ని విషయాలు తెలియజేయాలని.. కానీ, ఉద్దేశపూర్వకంగానే నటరాజన్ కేసు విషయాన్ని దాచారని ఆయన వివరించారు. దీంతో గత మంగళవారం నాడు నటరాజన్ నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఈ మేరకు ఎన్నికలకు వెళ్లకుండానే బీజేపీ ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.
కాగా, 10 రాష్ట్రాల్లోని 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జూన్ 1న ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్-4, గుజరాత్-4, కర్ణాటక-4, మధ్యప్రదేశ్-3, రాజస్థాన్-3, ఝార్ఖండ్-2 స్థానాల చొప్పున ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలో ఒక్కొక్క సీటు చొప్పున ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ముగ్గురు రాజీనామాలతో ఏర్పడిన ఖాళీలకూ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం.! క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్
ఒమన్ తీరాన చమురు నౌకలో పొగలు.. 20 మంది భారత నావికులు సురక్షితం!