సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిసంసన తీర్మానాన్ని తోసిపుచ్చిన రాజ్యసభ చైర్మన్
ABN , Publish Date - Apr 06 , 2026 | 09:41 PM
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ సోమవారంనాడు తోసిపుచ్చారు.
న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar)ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని (Impeachment Motion) రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ సోమవారంనాడు తోసిపుచ్చారు. నోటీసులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం దానిని అడ్మిట్ చేసుకోవడానికి చైర్మన్ నిరాకరించారు.
సీఈసీ తొలగింపును కోరుతూ మార్చి 12న టీఎంసీ నేతృత్వంలో విపక్షాలు అభిశంనస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఆర్టికల్ 324(5), 124(4) జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 కింద నోటీసు ఇచ్చాయి. ఈ తీర్మానంపై 130 మంది లోక్‌సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేశారు. భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై అభిశంసన తీర్మానం తీసుకురావడం ఇదే ప్రథమం. అయితే రాజ్యసభ చైర్మన్ తాజా నిర్ణయంతో ఈ ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడింది.
టీఎంసీ స్పందన
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ తోసిపుచ్చడంపై తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ స్పందించారు. 'మన సుమున్నత పార్లమెంటును బీజేపీ పరిహసిస్తూనే ఉంది' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఎన్నికల కమిషన్‌ను లక్ష్యంగా చేసుకునే బదులు ఎన్నికల్లో పోటీపై రాజకీయ పార్టీలు దృష్టిసారిస్తే బాగుంటుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
కోల్‌కతాను పాక్ టార్గెట్ చేస్తామంటే ఉలకరేం?.. మోదీపై మమత ఫైర్
బెంగాల్ స్టార్ క్యాంపెయినర్ లియాండర్ పేస్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత