Share News

రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం.. ఒక్కసారిగా కమ్ముకున్న చీకట్లు, వీడియో వైరల్!

ABN , Publish Date - May 30 , 2026 | 05:28 PM

రాజస్థాన్‌లో భారీ ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. తుపాను దాటికి ఒక్కసారిగా చీకట్లు కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

రాజస్థాన్‌లో ఇసుక తుపాను బీభత్సం.. ఒక్కసారిగా కమ్ముకున్న చీకట్లు, వీడియో వైరల్!
Rajasthan Sandstorm

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ రోజు (శనివారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇసుక తుపాను తీవ్ర బీభత్సం సృష్టించింది. థార్ ఎడారి నుంచి వీచిన బలమైన గాలుల కారణంగా ఆకాశమంతా ఇసుక రేణువులు కమ్ముకొని, పగటిపూటే ఒక్కసారిగా చీకట్లు ముసురుకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ముఖ్యంగా పశ్చిమ రాజస్థాన్‌లోని చురు, బీకనీర్, హనుమాన్‌గఢ్, గంగానగర్ జిల్లాలపై ఈ తుపాను ప్రభావం తీవ్రంగా చూపింది. చురూ పరిసర ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో భీకరమైన ఈదురు గాలులు వీచాయి. భారీ ఎత్తున లేచిన ఇసుక మేఘాలు యావత్ ప్రాంతాన్నీ చుట్టేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


తీవ్రమైన ఇసుక తుపాను ముగిసిన వెంటనే వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ, అంతకుముందు సంభవించిన ఇసుక తుపాను సృష్టించిన బీభత్సం వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. అంతకుముందు శుక్రవారం కూడా రాజధాని జైపూర్‌లో ఇలాంటి భీకర వాతావరణమే కనిపించింది. నిన్న ధోల్‌పుర్‌ జిల్లాలో అత్యధికంగా 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో మారుతున్న ఈ వాతావరణ పరిస్థితులను భారత వాతావరణ శాఖ (IMD) నిరంతరం పర్యవేక్షిస్తోంది. జైపూర్‌లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లో ఈ తరహా ఇసుక తుఫానులు, ఈదురు గాలులతో కూడిన వాతావరణం మరో నాలుగైదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


ఇవి కూడా చదవండి

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. స్వదేశానికి వెళ్లాల్సిందేననే నిబంధనపై అమెరికా యూటర్న్..

వైభవ్ శరీరమే లక్ష్యంగా బౌలింగ్.. గుజరాత్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..

Updated Date - May 30 , 2026 | 06:20 PM