అమిత్ షాకి రాహుల్ గాంధీ ఘాటు లేఖ
ABN , Publish Date - Jul 26 , 2026 | 11:49 AM
ఢిల్లీలో విద్యార్థులపై దాడి ఘటనకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటు లేఖ రాశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో విద్యార్థులపై దాడి ఘటనకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటు లేఖ రాశారు. జూలై 20న శాంతియుత నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్, బాష్పవాయువు ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించారు. నిరసనకారులపై పెల్లెట్ తుపాకులు వాడటం అత్యంత దిగ్భ్రాంతికరమని లేఖలో పేర్కొన్నారు. పెల్లెట్ దాడి వల్ల 19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లోచాబ్ తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. కంటి చూపు పోయే ముప్పును ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థులపై బలప్రయోగానికి, పెల్లెట్ గన్‌ల వాడకానికి ఎవరు అనుమతిచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను లాఠీలతో కొట్టిన సివిల్ డ్రెస్ వ్యక్తులు పోలీసులా? లేక వాలంటీర్లా? అని లేఖలో సూటి ప్రశ్న సంధించారు.
నిరసనల్లో యువతులు సహా వందల మంది గాయపడ్డారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుత నిరసన అనేది ప్రజాస్వామ్యానికి మూలమని రాహుల్ గాంధీ అన్నారు. నిరసనకారుల భద్రతను కాపాడాల్పిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. బలప్రయోగానికి దిగే బదులు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని అన్నారు. నిరసనల్లో బలప్రయోగానికి పోలీసులు దిగడానికి కారణం ఎవరో చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. రేపు పార్లమెంటు సమావేశం జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇది ఆరంభం మాత్రమే.. అభిజీత్ దీప్కే మరో వీడియో
అస్సాంలో వరద బీభత్సం.. 66కు చేరిన మృతుల సంఖ్య..