రాహుల్ 7 రిజిజు
ABN , Publish Date - Aug 09 , 2026 | 05:47 AM
చట్టసభల్లో మహిళలకు 33ురిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లును ఆమోదించే విషయంలో అధికార, ప్రతిపక్షాల నడుమ ప్రతిష్టంభన కొనసాగుతోంది. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ....
మహిళా రిజర్వేషన్ అంశంపై మాటల ఫైట్.. మహిళలకు స్వేచ్ఛ కావాలని రాహుల్ వ్యాఖ్య
అయితే బిల్లుకు మద్దతివ్వాలన్న రిజిజు
2023లోనే ఇచ్చామన్న రాహుల్
న్యూఢిల్లీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో మహిళలకు 33ురిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లును ఆమోదించే విషయంలో అధికార, ప్రతిపక్షాల నడుమ ప్రతిష్టంభన కొనసాగుతోంది. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ.. ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ పేరిట ఆన్‌లైన్ వేదికగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో మహిళా స్వేచ్ఛ, వారి భాగస్వామ్యాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు రాహుల్ సహా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి.. ‘మహిళలపై అంత గొప్ప అభిప్రాయం ఉంది కాబట్టి.. ఇకనైనా మహిళా బిల్లుకు మద్దతివ్వాలి’ అని కోరారు. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై రాహుల్ విమర్శలు వ్యక్తం చేశారు. మొత్తంగా రాహుల్, రిజిజుల మధ్య మహిళా కోటాపై ‘ఎక్స్’ వేదికగా మాటల యుద్ధం జరిగింది. మహిళాభివృద్ధిపై రాహుల్ స్పందిస్తూ.. ‘మహిళలకు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛ లేకుండా దేశం అభివృద్ధి చెందదు. భారతీయ మహిళల శక్తి బందీగా ఉండిపోయింది. వ్యాపార, రాజకీయాల్లో మహిళల సాధికారత.. వారి భాగస్వామ్యానికి మించి ఉండాలని నేను భావిస్తాను’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కిరెణ్ రిజిజు ఆసక్తికరంగా స్పందించారు. ‘మహిళల విషయంలో రాహుల్ మనసు మారినట్టుందే’ అని వ్యాఖ్యానించారు. మహిళలపై అంత గొప్ప అభిప్రాయం ఉన్నవారు.. ఇప్పటికైనా మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. దీనిపై రాహుల్ తిరిగి స్పందిస్తూ.. మహిళా బిల్లు 2023లోనే పార్లమెంటులో ఆమోదం పొందిందని, అప్పట్లో తాము సంపూర్ణ మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు మహిళా కోటాను అమలు చేయడంలో ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీశారు. మహిళల రిజర్వేషన్‌కు నియోజకవర్గల పునర్విభజన బిల్లు(డీలిమిటేషన్)కు లింకెందుకని ప్రశ్నించారు. ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే 2023 నాటి చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, మహిళలకు రిజర్వేషన్ అంశంపై ప్రతిపక్షాలను ఒప్పించలేకపోవడంతో సోమవారం నాటి పార్లమెంటు ఎజెండాలో కేంద్రప్రభుత్వం రెండు వేరే బిల్లులను చేర్చింది. జాతీయ ట్రిబ్యునల్ కమిషన్ ఏర్పాటుకు వీలు కల్పించే ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు, గనుల తవ్వకాలు, ఖనిజ వనరుల అభివృద్ధి బిల్లును ఎజెండాలో చేరుస్తూ శనివారం బులెటిన్ విడుదల చేశారు. అయితే, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, ఎఫ్‌సీఆర్‌ఐ సవరణ బిల్లులను ప్రభుత్వం ఆకస్మికంగా ప్రవేశపెట్టవచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే, ఉభయ సభల్లో సభ్యులందరూ హాజరు కావాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఇండియా కూటమి పార్టీలకు కూడా తమ తమ ఎంపీలు గైర్హాజరు కాకుండా చూసుకోవాలని కోరింది.
యువతకు సామర్థ్యాలున్నా ఉద్యోగ అవకాశాలేవీ: రాహుల్
ప్రయాగ్‌రాజ్: యువతే భారత దేశానికి అతి పెద్ద బలమని, భారతదేశ యువతకు సామర్థ్యాలున్నా ఉద్యోగావకాశాలు లేవని రాహుల్‌గాంధీ అన్నారు. శనివారం ప్రయాగ్‌రాజ్‌లోని కేపీ గ్రౌండ్‌లో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’(విద్యార్థుల ప్రతిధ్వని) కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విద్యా వ్యవస్థ ప్రమాణాలు పడిపోవడంతో యువత నిరాశలో మునిగిపోయిందని అన్నారు. తయారీ రంగం కునారిల్లుతోందని, రుణాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతుండడంతో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని చెప్పారు. కృత్రిమ మేధ, ప్రశ్న పత్రాల లీకేజీల కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ ఇటీవల ఉద్యమం జరిపిన విద్యార్థులు చీకట్లో చిరు దీపాన్ని వెలిగించారని అన్నారు. కాగా, విద్యార్థుల సమస్యలపై పోరులో కాంగ్రెస్ కంటే కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)నే పైచేయిగా నిలిచిందని శశిథరూర్ అన్నారు. తమ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోం కీ గూంజ్ ప్రచార కార్యక్రమం సీజేపీ ఆందోళనలకు వచ్చిన ప్రజా స్పందనను సాధించడంలో, విద్యార్థులు, యువకులపై ప్రభావం చూపడంలో విఫలమైందని వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..
డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ