Share News

యూపీఐ చార్జీలు.. యూఎస్ ఒత్తిడికి కేంద్రం లొంగిందన్న రాహుల్ గాంధీ

ABN , Publish Date - Sep 15 , 2026 | 04:55 PM

అమెరికా ప్రభుత్వ ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా ఆరోపించారు. యూపీఐ చార్జీలు విధించే దిశగా చడీచప్పుడూ లేకుండా మార్గం సిద్ధం చేసిందని మండిపడ్డారు.

యూపీఐ చార్జీలు.. యూఎస్ ఒత్తిడికి కేంద్రం లొంగిందన్న రాహుల్ గాంధీ
Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ప్రభుత్వ ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా ఆరోపించారు. యూపీఐ చార్జీలు విధించే దిశగా చడీచప్పుడూ లేకుండా మార్గం సిద్ధం చేసిందని మండిపడ్డారు. రూ.2 వేల లోపు యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు చార్జీలు విధించవద్దంటూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడంతో రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా నోటిఫికేషన్ పలు సందేహాలను లేవనెత్తుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఇది చివరకు అధిక మొత్తాల యూపీఐ లావాదేవీలపై చార్జీల వడ్డనకు దారి తీయవచ్చని అన్నారు. డొనాల్డ్ ట్రంప్‌ను సంతోషపెట్టేందుకు అమెరికా సంస్థలకు కేంద్రం ఈ చర్యతో స్వాగతం పలుకుతోందా? అని ప్రశ్నించారు. ‘ మర్చెంట్ యూపీఐ చెల్లింపులపై ఎమ్‌డీఆర్‌ను ఇకపై విధించే అవకాశం ఉంది. మొత్తం యూపీఐ లావాదేవీల్లో సంఖ్యా పరంగా వీటి (రూ.2 వేలకు పైబడి లావాదేవీలు) వాటా 5 శాతమే అయినప్పటికీ విలువ పరంగా మాత్రం 65 శాతం. వినియోగదారులపై చార్జీలు వద్దని ప్రభుత్వం చెబుతోంది. మరి ఈ లావాదేవీలపై షాపుల వారు చెల్లించే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?’ అని అన్నారు.


యూపీఐ లావాదేవీలపై ఎమ్‌డీఆర్ చార్జీలు విధించకపోవడాన్ని అమెరికన్ కంపెనీలు ఎప్పటి నుంచే వ్యతిరేకిస్తున్నాయని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ ఒత్తిడికి తలొగ్గి ఎమ్‌డీఆర్ చార్జీలు విధించేందుకు కేంద్రం కొత్త మార్గం సిద్ధం చేసిందని ఆరోపించారు. ‘యూఎస్ డీల్ వలెనే ప్రధాని మోదీ మరోసారి రాజీ పడ్డారు. అమెరికా ఒత్తిడికి లొంగారు’ అని అన్నారు.

తాము గతంలో హెచ్చరించినట్టుగానే జరిగిందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్స్ సిస్టమ్స్ యాక్ట్ - 2007కు చేసిన సవరణలను పేర్కొన్నారు. రూ.2 వేల పైచిలుకు విలువలగల యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించకుండా స్పష్టమైన రక్షణ ఏదీ కల్పించలేదని చెప్పారు. ఇది చార్జీల విధింపునకు వేదికను సిద్ధం చేయడమేనని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఈ రూ.2 వేల పరిమితికి కూడా మార్పులు రావొచ్చని హెచ్చరించారు.


ఎమ్‌డీఆర్ అంటే..

క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీల ప్రాసెసింగ్ కోసం షాపుల వారు చెల్లించే ఫీజును మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (ఎమ్‌డీఆర్) అని అంటారు. ఎలక్ట్రానిక్ చెల్లింపులకు సంబంధించిన ఉపకరణాలు, నెట్‌వర్క్ మెయింటెనెన్స్, భద్రత కల్పించినందుకు ఈ ఫీజులు విధిస్తారు. వాణిజ్య సంస్థలు చెల్లించే ఈ చార్జీలను బ్యాంకులు, పేమెంట్ నెట్‌వర్క్‌లు (వీసా, మాస్టర్ కార్డు) తీసుకుంటాయి. ప్రస్తుతం భారత్‌లో క్రెడిట్, డెబిట్ కార్డుల చెల్లింపులపై ఎమ్‌డీఆర్ చార్జీలను విధిస్తున్నారు. ఇవి ఆయా వాణిజ్య సంస్థలే చెల్లిస్తున్నాయి. రూపే డెబిట్ కార్డు ఎమ్‌డీఆర్ చార్జీలకు సంబంధించి ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తోంది. అయితే, యూపీఐ సేవలపై మాత్రం ప్రస్తుతం ఎలాంటి చార్జీలు లేవు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


ఈ వార్తలనూ చదవండి:

గణపతి పూజలో పాల్గొన్న సల్మాన్ ఖాన్

యాంటిల్లాల్లో వినాయక చవితి వేడుకలు.. నీతా, రాధిక కాస్ట్యూ్మ్స్ అదుర్స్..

Updated Date - Sep 15 , 2026 | 05:37 PM