Share News

విద్యార్థుల కలలు చిన్నాభిన్నం: రాహుల్‌

ABN , Publish Date - May 13 , 2026 | 05:31 AM

నీట్‌ పేపర్‌ లీక్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. మోదీ సర్కారుపై ధ్వజమెత్తారు. ప్రధాని చెబుతున్న అమృత కాలం కాస్తా దేశానికి విష యుగంగా...

విద్యార్థుల కలలు చిన్నాభిన్నం: రాహుల్‌

న్యూఢిల్లీ, మే 12: నీట్‌ పేపర్‌ లీక్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. మోదీ సర్కారుపై ధ్వజమెత్తారు. ప్రధాని చెబుతున్న అమృత కాలం కాస్తా దేశానికి విష యుగంగా మారిందని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థుల కష్టం, కలలు బీజేపీ సారథ్యంలోని అవినీతి వ్యవస్థ వల్ల చిన్నాభిన్నమయ్యాయని ఆరోపించారు. ‘‘నీట్‌ పరీక్ష రద్దయింది. దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థుల కఠోర శ్రమ, త్యాగాలు, కలలు చెదిరిపోయాయి. లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష కోసం ఎన్నో రాత్రులు మేల్కొని ఉండి చదివారు. ఇందుకు వారికి దక్కిన ప్రతిఫలం పేపర్‌ లీకేజీలు. ఇది కేవలం ఒక వైఫల్యం కాదు.. దేశ యువత భవిష్యత్తుపై జరిగిన నేరం’’ అని రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఎన్‌టీఏ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు. నీట్‌ పేపర్‌ లీకేజీ, పరీక్ష రద్దుపై తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌ స్పందించారు. నీట్‌ వ్యవస్థే పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. ఏటా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నీట్‌ పరీక్ష విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ పేపర్‌ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా మెడికల్‌ అసోసియేషన్‌ (ఫైమా)’ డిమాండ్‌ చేసింది. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి, పేపర్‌ లీకేజీ వెనక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పేపర్‌ లీక్‌, పరీక్ష రద్దుతో నిజాయతీగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల కలలు కల్లలయ్యాయని తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం

అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత

Updated Date - May 13 , 2026 | 05:31 AM