Share News

ఏడాదిలోపు మోదీ సర్కార్‌ పతనం!

ABN , Publish Date - May 25 , 2026 | 04:16 AM

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇంకో ఏడాది కంటే మనుగడ సాగించజాలదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభానికి దాని విధాన వైఫల్యమే కారణమన్నారు. నీట్‌ పరీక్ష లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.....

ఏడాదిలోపు మోదీ సర్కార్‌ పతనం!

  • విధాన వైఫల్యం వల్లే ఆర్థిక సంక్షోభం

  • నీట్‌ పరీక్ష లీకేజీపై విద్యామంత్రి రాజీనామా చేసేవరకు విశ్రమించం

  • మైనారిటీల ముసుగులో కాదు.. ముస్లిం సమస్యలపై నేరుగా పోరాడండి

  • కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జూన్‌ 6న మైనారిటీ, ఎస్సీల ఉమ్మడి సదస్సు

  • భవిష్యత్‌లో హిందూ-ముస్లిం రాజకీయాలు ఉండవు

  • అసమానతలే జాతీయ సమస్యగా మారతాయ్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌

  • బీజేపీ ఆగ్రహం.. విదేశీ శక్తులతో కలిసి కుట్ర చేస్తున్నారని ధ్వజం

న్యూఢిల్లీ, మే 24: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇంకో ఏడాది కంటే మనుగడ సాగించజాలదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభానికి దాని విధాన వైఫల్యమే కారణమన్నారు. నీట్‌ పరీక్ష లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసేవరకు కాంగ్రెస్‌ విశ్రమించదని స్పష్టంచేశారు. ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ మైనారిటీ విభాగం సలహామండలి సమావేశంలో రాహుల్‌ మాట్లాడారు. ‘మోదీ ప్రభుత్వం ఏడాదిలో కుప్పకూలుతుంది. దీనికి పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం ఒక కారణం కానుంది. నీట్‌ పరీక్ష లీకేజీని నిరసిస్తూ దేశంలో యువత రోడ్లెక్కుతుంటే.. మోదీ ఇటలీ వెళ్లి రీల్స్‌ చేసుకుంటున్నారు. ఈ లీకేజీ లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసింది. పలువురు విద్యార్థులు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీనికి మోదీ బాధ్యత వహించలేదు. కనీసం విద్యామంత్రి ప్రధాన్‌ను కూడా తొలగించలేదు. ఈ విషయంలో అసలు స్పందించనేలేదు’ అని ఆక్షేపించారు. దేశవ్యాప్తంగా ఈ లీకేజీపై నిరసనలు వ్యక్తమవుతున్నాయంటూ.. హైదరాబాద్‌లో ఎన్‌ఎస్‌యూఐ నేతృత్వంలో జరిగిన భారీ నిరసన ర్యాలీ వీడియోను రాహుల్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. ‘‘ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసేంతవరకూ, నీట్‌ వంటి ప్రశ్నపత్రాల లీకేజీలను నివారించడానికి ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసేంత వరకూ విశ్రమించం.’’ అని పేర్కొన్నారు. కాగా.. ముస్లింలకు సంబంధించిన విషయాలను ప్రస్తావించేటప్పుడు.. మైనారిటీలంటూ విశాలమైన ‘ముసుగు’ వేయనక్కర్లేదని.. నేరుగా, బహిరంగంగా ‘ముస్లిం’ల సమస్యలనే చెప్పి పోరాడాలని శనివారంనాటి సలహా కమిటీ భేటీలో రాహుల్‌ స్పష్టంచేశారు. ముస్లింలు, దళితులు, ఓబీసీలు, ఇతరులకు ఏదైనా అన్యాయం జరిగితే.. బాధిత వర్గం పేరు చెప్పడానికి సందేహించనవసరం లేదని స్పష్టంచేశారు. భవిష్యత్‌లో హిందూ-ముస్లిం రాజకీయాలు ఉండవని, పెరుగుతున్న అసమానతలు, ద్రవ్యోల్బణం ప్రధాన జాతీయ సమస్యగా మారతాయన్నారు. సామాజిక న్యాయం, రాజ్యాంగ హక్కుల కోసం జూన్‌ 6న కాంగ్రెస్‌ మైనారిటీ, ఎస్సీల ఉమ్మడి సదస్సు నిర్వహిస్తుందని వెల్లడించారు. ఆర్థిక సవాళ్ల నుంచి జనం దృష్టి మరల్చేందుకు బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ మతపరమైన విభజన తీసుకొస్తున్నాయని ఆరోపించారు. భవిష్యత్‌లో నిజమైన రాజకీయ పోటీ ధనికులు, పేదల మధ్యే ఉంటుందని చెప్పారు.


ముస్లింలకు చేరువయ్యేందుకే..

ముస్లింలకు చేరువయ్యేందుకే రాహుల్‌ ‘ముస్లిం’ సందేశం ఇచ్చారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కేరళలో ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ (ఐయూఎంఎల్‌) మద్దతుతో కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే అసోం ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన 19 అసెంబ్లీ స్థానాల్లో 18 మంది ముస్లింలే. ఈ నేపథ్యంలో తన పార్టీపై ముస్లిం ఓటర్లలో విశ్వాసం తిరిగి పాదుగొల్పడం కోసం రాహుల్‌ తాజా సందేశం ఇచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే వచ్చేఏడాది కీలక రాష్ట్రాలైన యూపీ, గుజరాత్‌, పంజాబ్‌తో పాటు ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ముస్లింలు, ఎస్సీలకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్‌ వ్యూహాత్మక సమావేశాలు నిర్వహిస్తోందని.. ఒంటరి పోటీలకూ సిద్ధమవుతున్నట్లుగా ఉందంటున్నారు.

అరాచకాల సృష్టికి రాహుల్‌ యత్నాలు: బీజేపీ

ఏడాదిలో మోదీ సర్కారు కుప్పకూలుతుందన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు దేశంలో అరాచకాల సృష్టికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టింది. విదేశీ శక్తుల ప్రోద్బలంతో మోదీ సర్కారును అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారని కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, బీజేపీ నేతలు సుధాంశు త్రివేది, సంబిత్‌ పాత్రా ఆదివారం విరుచుకుపడ్డారు. ఏఐసీసీ మైనారిటీ విభాగం భేటీలో రాహుల్‌ వ్యాఖ్యలు ‘టూల్‌కిట్‌ గ్యాంగ్‌’ భారీ కుట్రను బయటపెట్టాయని గోయల్‌ ‘ఎక్స్‌’లో ధ్వజమెత్తారు. ‘ఆయనది మామూలు ప్రకటన కాదు. దేశంలో అరాచకాన్ని వ్యాపింపజేసేందుకు పెద్ద కుట్రగా కనిపిస్తోంది. ప్రత్యక్ష పోరులో బీజేపీని ఓడించలేమని రాహుల్‌కు, ఆయన సహాయకులకు అర్థమైంది. అందుకే దేశవ్యాప్తంగా హింసను ప్రజ్వలింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. రాహుల్‌ మాటల్లో రాజకీయ నిస్పృహ ఉందని.. అంతేగాక దేశాన్ని అస్థిరపరచాలనే ప్రమాదకర మనస్తత్వాన్ని ఆయన బహిరంగంగా చాటుకున్నారని త్రివేది అన్నారు. ఎన్నికల్లో వరుస ఓటములతో కాంగ్రెస్‌ కుదేలైందని ఎద్దేవా చేశారు.

Updated Date - May 25 , 2026 | 04:16 AM