Share News

మోదీ దిగిపోయే సమయం వచ్చింది

ABN , Publish Date - Jul 26 , 2026 | 05:31 AM

దేశంలో విద్యావ్యవస్థ పునర్నిర్మాణం దిశగా ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో అడుగు పడిందని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని...

మోదీ దిగిపోయే సమయం వచ్చింది

  • విద్యార్థులు ధైర్యంగా నిలిచి పోరాడారు

  • దాడులపై మోదీ క్షమాపణ చెప్పాల్సిందే!

  • కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ, జూలై 25: దేశంలో విద్యావ్యవస్థ పునర్నిర్మాణం దిశగా ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో అడుగు పడిందని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, మోదీ ప్రభుత్వాన్ని దింపేసే సమయం వచ్చిందని వ్యాఖ్యానించాయి. ప్రజల ముందు ప్రభుత్వం తల వంచాల్సిందేనని స్పష్టం చేశాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థులపై జరిగిన దాడుల పట్ల ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశాయి.

విద్యార్థుల పోరాటం గొప్పది..

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా కేవలం ప్రారంభం మాత్రమేనని, అయినా దేశ విద్యావ్యవస్థను పునర్నిర్మించుకునే దిశగా పెద్ద అడుగు అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం కోసం దేశ భవిష్యత్తు కోసం ధైర్యంగా నిలబడి పోరాడారని విద్యార్థులను అభినందించారు. అణచివేత, ఒత్తిళ్ల మధ్య కూడా వారు వెనక్కి తగ్గకుండా నిలబడటం గొప్ప విషయమన్నారు. విద్యార్థులపై దాడి చేసినవారిపై చర్యలు చేపట్టడం, విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పడమనే రెండు డిమాండ్లు పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు. విద్యార్థులపై హింసకు, పెల్లెట్‌ గన్స్‌ వంటి ప్రాణాంతక ఆయుధాల వినియోగానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షానే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘విద్యార్థుల ఉద్యమం బీజేపీ-ఆర్‌ఎ్‌సఎ్‌సలకు గట్టి హెచ్చరిక. దేశాన్ని సొంత జాగీరులా పాలించాలనే ధోరణిని ప్రజలు సహించరు. అలా చేస్తే ఇప్పటి ఆందోళన కంటే పది రెట్లు పెద్ద స్థాయిలో ఉద్యమాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు భారత విద్యా వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. కానీ ఇప్పుడు దానిపై దాడి జరుగుతోంది. చెదపురుగులు చెక్కను లోపలి నుంచి తొలిచేసినట్టు ఆర్‌ఎ్‌సఎస్‌ మన దేశ విద్యావ్యవస్థను తొలిచేసింది. విద్యార్థుల నిరసనలు కేవలం ప్రశ్నపత్రం లీక్‌కే పరిమితం కాదు. ప్రతిపక్షం తరఫున కూడా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. మోదీ ప్రభుత్వం అణచివేసిన ప్రతి రైతు, కార్మికుడు, పేదలు, మధ్యతరగతి ప్రజలు.. అన్ని వర్గాలు కూడా ధైర్యంగా నిలబడాలి. మోదీ అనేది గతం.. విద్యార్థులు దేశ భవిష్యత్తు. గతం ఎప్పుడూ భవిష్యత్తుపై విజయం సాధించలేదు’’ అని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ విధ్వంసానికి, అవినీతికి, అసమర్థతకు ప్రతీకగా నిలిచిన ధర్మేంద్ర ప్రధాన్‌ వెళ్లిపోవడం మంచి పరిణామమని వ్యాఖ్యానించారు.


తప్పు చేస్తే తలవంచాల్సిందే: ఖర్గే

ఏ ప్రభుత్వమైనా సరే తప్పు చేస్తే ప్రజల ముందు తలవంచాల్సిందేనని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. విద్యార్థుల తరఫున, అవినీతి ప్రభుత్వం వల్ల పిల్లలను కోల్పోయిన కుటుంబాల తరఫున, యువత తరఫున పార్లమెంటులో, బయటా గళం విప్పిన ప్రతిపక్షాలు, ధైర్యంగా పోరాడిన విద్యార్థులు సాధించిన విజయమిదని వ్యాఖ్యానించారు. మోదీ ఇన్‌స్టాలో వీడియోలు పెట్టడం, ఫాలోవర్లు పెరిగినందుకు కృతజ్ఞతలు చెప్పడం వంటివి పక్కనపెట్టి.. మొదట విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ డిమాండ్‌ చేశారు.

ఇది ప్రజాస్వామ్య విజయం: కేజ్రీవాల్‌

విద్యార్థుల ఆందోళనకు మోదీ ప్రభుత్వం దిగిరావడం, ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా ప్రజాస్వామ్య విజయమని ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈ విజయం సాధించిన యువతను అభినందించారు. ఇక ఆర్జేడీ నేత తేజస్వియాదవ్‌, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ అణచివేతపై ఇది గొప్ప విజయమని అభివర్ణించారు.

విద్యార్థులకు బాలీవుడ్‌ ప్రముఖుల అభినందనలు

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా నేపథ్యంలో బాలీవుడ్‌ ప్రముఖులు విద్యార్థులను, సీజేపీని అభినందిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. హీరోయిన్‌ సోనాక్షి సిన్హా.. ప్రధాన్‌ రాజీనామా, దీప్కే స్పందన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. చప్పట్లతో కూడిన ఎమోజీని, ‘భాయ్‌ చాలా బాగా చేశారు’ అనే క్యాప్షన్‌ను జత చేశారు. ప్రియాంకా చోప్రా, విజయ్‌వర్మ, వీర్‌ దాస్‌, మలైకా అరోరా, డయానా పెంటీ తదితరులు కూడా విద్యార్థులను అభినందిస్తూ పోస్టులు పెట్టారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

Updated Date - Jul 26 , 2026 | 05:31 AM