అప్రూవర్‌గా మారు!
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:38 AM
తన పదవికి వెంటనే రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారిపోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచించారు.
జ్ఞానేశ్.. తప్పును ఒప్పుకొని పదవికి రాజీనామా చెయ్..
మీరు ఇక సీఈసీగా ఉండలేరు
మీరు చేసిన తప్పుల వెనుకమాస్టర్‌మైండ్ వేరే ఉన్నారని తెలుసు
మా ఉద్యమం శివతాండవం..నెలలు, ఏళ్లయినా కొనసాగిస్తాం
ప్రస్తుత పోరాటాలన్నింటి లక్ష్యం దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే
మోదీ సర్కారులోని 200 మంది అధికారులు మాతో టచ్‌లో ఉన్నారు
మీడియా సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ
కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నుంచి సుప్రీంకోర్టు దాకా విపక్షాల ర్యాలీ
ఈసీ నిర్ణయాలను సమీక్షించండి
సర్‌ను తాత్కాలికంగా నిలిపివేయండి
ఓటర్ల జాబితాలో అవకతవకలపై బాధ్యుల మీద చర్యలు తీసుకోండి
సుప్రీంకోర్టులో ‘ఇండి’ నేతల పిటిషన్
నేడు విచారణ జరిగే అవకాశం
న్యూఢిల్లీ, అక్టోబరు12 (ఆంధ్రజ్యోతి): తన పదవికి వెంటనే రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారిపోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచించారు. జ్ఞానేశ్‌కుమార్ తన పదవికి రాజీనామా చేసేవరకు తమ ఉద్యమం కొనసాగిస్తామని.. అది నెలలైనా, ఏళ్లయినా వెనక్కు తగ్గేదే లేదని స్పష్టంచేశారు. తప్పు చేశానన్న భావనతో సీఈసీకి రాత్రిపూట నిద్రకూడా పట్టడం లేదని అన్నారు. జ్ఞానేశ్‌కుమార్ తనకు సందేశాలు పంపుతున్నారని చెప్పారు. సోమవారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జ్ఞానేశ్‌కుమార్ నుంచి నాకు సందేశాలు వస్తున్నాయి. ఆయనకు నేను స్పష్టంగా చెప్తున్నా.. మీరు వెంటనే సీఈసీ పదవికి రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారిపోండి. మీరు ఇక ఎంతమాత్రమూ ఆ పదవిలో కొనసాగలేరు. మీరు తప్పులు చేశారు.. కానీ, వాటి వెనుక మాస్టర్ మైండ్ మీరు కాదని మాకు తెలుసు. రాజీనామా చేస్తే మిమ్మల్ని క్షమిస్తాం. మీపై ఉన్న ఒత్తిడిని అర్థం చేసుకుంటాం. మాకు మీ గురించి సమాచారం ఉంది. మీ గతం మాకు తెలుసు. మీ అవినీతి గురించి మాకు తెలుసు. మేము వేచి చూస్తున్నాం’ అని రాహుల్‌గాంధీ అన్నారు. దాదాపు 200 మంది ప్రభుత్వోద్యోగులు, ఈడీ, సీబీఐ, విదేశాంగ శాఖల ఆధికారులు తమకు సమాచారం ఇస్తున్నారని చెప్పారు.

ఈ ఉద్యమం శివతాండవం..
దేశాన్ని కాపాడేందుకు ఎన్నిరోజులైనా ఉద్యమం కొనసాగిస్తామని రాహుల్‌గాంధీ అన్నారు. ‘మా పోరాటం శివతాండవం...శివుడి పెళ్లి బారాత్.. ఈ బారాత్‌లోకి ఎవరైనా వచ్చి చేరొచ్చు.. దేశప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. మీరు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనే పరిస్థితి లేకుంటే.. మీరు ఉన్నచోటి నుంచే మాకు మద్దతు తెలపండి. ఈ ఉద్యమం రాహుల్‌గాంధీ కోసమో.. మోదీ కోసమో కాదు.. దేశాన్ని కాపాడటానికి... రాజ్యాంగాన్ని కాపాడటానికి.. ఈ పని ఒకటి రెండు రోజుల్లో అయ్యేది కాదు. నెలలు, సంవత్సరాలైనా పట్టొచ్చు..ఇందులో విజయం సాధించేవరకు పోరాడుతూనే ఉంటాం’ అని స్పష్టంచేశారు. ‘మోదీకే కాదు.. ఈ దేశం ఎవరికీ భయపడదు. ఇప్పుడు ఎవరు, ఏ రూపంలో పోరాటం చేస్తున్నా.. వాటన్నింటి లక్ష్యం ఒక్కటే.. ఈ దేశాన్ని కాపాడటమే. రాజ్యాంగ ఔన్నత్యాన్ని తిరిగి నిలబెట్టే వరకు.. సీఈసీ దిగిపోయేవరకు.. ఎన్నికల వ్యవస్థను సంస్కరించేవరకు ఈ దేశ యువత పోరాటాన్ని ఆపరు’ అని రాహుల్ అన్నారు.
సీజేఐ రాజీనామా చేయాలి: కేరళ పీసీసీ
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ కేరళ విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ఇటీవల సీజేఐ స్పందిస్తూ.. శాంతిభద్రతల అంశం తన పరిధిలోనిది కాదని అన్నారు. ఈ ప్రకటనపై కాంగ్రెస్ మండిపడింది. ‘ప్రియమైన సూర్యకాంత్.. శాంతిభద్రతల అంశం మీ పరిధిలోనిది కాకపోతే వెంటనే రాజీనామా చేయండి. శాంతిభద్రతలు కాపాడే మరో వ్యక్తితో ఆ పోస్టును భర్తీ చేస్తాం’ అని పేర్కొంది. ఈ ప్రకటనపై బీజేపీ మండిపడింది. ‘సీజేఐని కాంగ్రెస్ బెదిరిస్తోంది. రాజ్యాంగంకంటే గాంధీ వాద్రా పరివార్ ఉన్నతమైనదని భావిస్తోంది’ అని బీజేపీ నేత ప్రదీప్ భండారీ ఆరోపించారు. విమర్శలు తీవ్రం కావటంతో తన పోస్టును కేరళ పీసీసీ తొలగించింది.
సుప్రీంకోర్టు వరకు భారీ ర్యాలీ
సీఈసీ, ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు సోమవారం కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నుంచి సుప్రీంకోర్టు వరకు వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రియాంకగాంధీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్, టీఎంసీ(మమత) అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఐ నేత డీ రాజా, సీపీఎం నేత ఎంఏ బేబీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ(ఎస్‌పీ) నేత సుప్రియా సూలే, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, సీపీఐఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్య, ఐఏయూఎంఎల్ నేత ఈటీమహమ్మద్ బషీర్, తెలంగాణ, కేరళ, కర్ణాటక సీఎంలు రేవంత్‌రెడ్డి, సతీశన్, డీకేశివకుమార్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నేహా బోరా వంటి అనేక మంది యువ నిరసనకారులు, యోగేంద్ర యాదవ్ వంటి సామాజిక కార్యకర్తలు కూడా ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ ర్యాలీని భగవాన్‌దాస్ రోడ్‌లో పోలీసులు అడ్డుకున్నారు. అయినా ఆగకుండా నిరసనకారులు ముందుకు వెళ్లారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లినప్రతిపక్ష నేతలు.. ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టులో పిటిషన్ సమర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆరు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి
పూంచ్‌లో భారీ పేలుడు.. నలుగురు ఉగ్రవాదులు మృతి!