మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శాఖను మార్చొచ్చు: రాహుల్ గాంధీ
ABN , Publish Date - Jul 25 , 2026 | 01:05 PM
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మరో శాఖకు మార్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మరో శాఖకు మార్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్న వార్తలు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించబోదన్న వార్తల నడుమ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా మూడు డిమాండ్స్‌ను విద్యార్థులు ప్రభుత్వం ముందు పెట్టారని అన్నారు. వీటి విషయంలో వారు రాజీపడబోరని అభిప్రాయపడ్డారు.
‘అసమర్థ, అవినీతి మరక అంటిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది మొదటి డిమాండ్. అయితే, ఆయన శాఖ మార్చే అంశం ప్రధాని కేబినెట్‌లో చర్చకు వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. భారతీయ విద్యార్థులు దీన్ని అస్సలు ఆమోదించరు. దీన్ని ఎవ్వరూ ఒకప్పుకోరు’ అని రాహుల్ గాంధీ చెప్పారు. ధ్వంసమైన విద్యార్థుల భవిష్యత్తు, అవినీతికి ఆయన సంకేతంగా నిలిచారని వ్యాఖ్యానించారు. ఆయనను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు.
సోమవారం నాటి విద్యార్థుల ర్యాలీలో పోలీసులు పెల్లెట్ గన్స్, లాఠీ చార్జ్‌కు దిగడాన్ని కూడా రాహుల్ గాంధీ ఖండించారు. ఈ చర్యలకు దిగిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భారత దేశ విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని మరోసారి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఒక గతమని, భవిష్యత్తు కోసం ఆయన పోరాడజాలరని వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి:
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..
ప్రధాని మోదీ పేరుతో నకిలీ వీడియోలు.. పాకిస్థాన్ సోషల్ మీడియా ఖాతాలపై కేంద్రం ఆరోపణ..