రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ! 11న కీలక ప్రకటన
ABN , Publish Date - Jun 07 , 2026 | 01:15 PM
తమిళనాట మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా లారెన్స్ చేసిన ప్రకటన దీనికి ఊతమిచ్చేలా కనిపిస్తోంది.
చెన్నై, జూన్ 7: తమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్) నుంచి మరో స్టార్ హీరో రాజకీయ రంగప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. తనదైన డాన్సులతో, సినిమాలతోనే కాకుండా.. అనాథ పిల్లలను ఆదుకుంటూ, ఎంతో మందికి ఉచిత వైద్యం అందిస్తూ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. ఆయన రాకతో తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలవుతాయా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తిరుచ్చి ఈస్ట్ నుంచి బరిలోకి?
గత కొన్ని రోజులుగా తమిళ రాజకీయ వర్గాల్లో రాఘవ లారెన్స్ పోటీపై ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. తమిళనాడులోని కీలకమైన 'తిరుచ్చి ఈస్ట్' (Trichy East) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత, సీఎం విజయ్ (Thalapathy Vijay) గతంలో తాను గెలిచిన 'తిరుచ్చి ఈస్ట్' స్థానాన్ని వదులుకున్న నేపథ్యంలో.. ఆ సీటు నుంచి రాఘవ లారెన్స్ పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. లారెన్స్‌కు విజయ్‌తో ఉన్న ఆత్మీయ సంబంధాల నేపథ్యంలో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
ఎక్స్ (X) వేదికగా లారెన్స్ స్పందన:
తన పొలిటికల్ ఎంట్రీ, తిరుచ్చి ఈస్ట్ పోటీపై వస్తున్న వార్తలపై రాఘవ లారెన్స్ స్పందించారు. ఆయన తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ.. 'నా రాజకీయ ప్రయాణం, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం గురించి సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు వస్తున్నాయి. వీటన్నింటికీ సంబంధించి, నా భవిష్యత్తు కార్యాచరణపై ఈనెల 11వ తేదీన ఒక కీలక ప్రకటన చేయబోతున్నాను. నా అభిమానులు, ప్రజలు అప్పటివరకు వేచి చూడాలని కోరుతున్నాను' అని లారెన్స్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.