Share News

జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట!

ABN , Publish Date - Jul 17 , 2026 | 06:16 AM

ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో గురువారం నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఊరేగింపు సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక భక్తుడు మృతిచెందగా...

జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట!

ఒక భక్తుడి మృతి.. 120 మందికి పైగా అస్వస్థత.. ఆస్పత్రికి తరలించిన ప్రత్యేక సహాయక బృందాలు

  • లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో పూరీ కిటకిట

పూరీ, జూలై 16: ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో గురువారం నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఊరేగింపు సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక భక్తుడు మృతిచెందగా 120 మందికి పైగా అస్వస్థత పాలయ్యారు. స్వామి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు రథం వద్ద గుమికూడటం ఈ దుర్ఘటనకు దారితీసింది. భారీ జనసందోహం కారణంగా ఊపిరి ఆడకపోవడంతో స్పృహ తప్పి పడిపోయిన ఓ వ్యక్తిని పూరీ జిల్లా ప్రధాన అస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అదేవిధంగా శ్వాస అందక ఇబ్బందులు పడుతున్న పలువురిని ప్రత్యేక సహాయక బృందాలు హుటాహుటిన ఆస్పత్రికి తరలించాయి. భక్తుడు మరణించిన ఘటనపై ఆరోగ్య శాఖ అధికారులు స్పందించాల్సి ఉంది. కాగా, మరో ఘటనలో ఇంకో భక్తుడు గుండెపోటుతో మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

మార్మోగిన ‘జై జగన్నాథ్‌’ నినాదాలు

పూరీ జగన్నాథుడి రథయాత్ర గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించడానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. పూరీ రహదారులపై స్వామివారితో పాటు ఆయన తోబుట్టువులైన బలభద్రుడు, సుభద్ర అధిష్ఠించిన రథాలను లాగడానికి వేలాది మంది బారులుతీరారు. అంతకుముందు ప్రధాన ఆలయం నుంచి దేవతామూర్తులను రథాల వద్దకు తీసుకొచ్చే పహండీ వేడుకలో భాగంగా తొలుత బలభద్రుడిని తాళధ్వజ రథంపైకి, సుభద్రను దర్పదలన్‌ రథంపైకి చేర్చారు. చివరగా భక్తుల జయజయ ధ్వానాల మధ్య జగన్నాథుడు తన నందిఘోష రథం వద్దకు చేరుకున్నారు. అనంతరం ‘జై జగన్నాథ్‌’ నినాదాల నడుమ బలభద్రుడి తాళధ్వజం ముందు కదలగా ఆ వెనుక దర్పదలన్‌, చివరగా నందిఘోష అనుసరించాయి. జగన్నాథుడి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ఊరేగింపు అక్కడకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయం వద్ద ముగుస్తుంది.

ఈ వార్తలనూ చదవండి:

న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

Updated Date - Jul 17 , 2026 | 06:16 AM