రూ.100 కోట్ల మనీ లాండరింగ్ కేసు.. పంజాబ్ మంత్రి అరెస్టు
ABN , Publish Date - May 09 , 2026 | 06:40 PM
రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా పంజాబ్ పరిశ్రమల శాఖ మంత్రి సంజీవ్ అరోరాను అరెస్టు చేసింది. పీఎంఎల్‌ఏ చట్టం కింద ఆయనను అరెస్టు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ పరిశ్రమల శాఖా మంత్రి సంజీవ్ అరోరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అరెస్టు చేసింది. మోసపూరిత జీఎస్టీ లావాదేవీలతో రూ.100 కోట్ల నగదు అక్రమ రవాణా జరిగినట్టు ఆరోపణలు రావడంతో దర్యాప్తు ప్రారంభించిన ఈడీ తాజాగా మంత్రిని పీఎంఎల్‌ఏ చట్టం కింద అరెస్టు చేసింది.
ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్‌లోని మంత్రి సంజీవ్ అధికారిక నివాసం సహా మొత్తం ఐదు చోట్ల ఈడీ అంతకుముందు సోదాలు నిర్వహించింది. మంత్రికి సంబంధించిన వ్యక్తులు, కంపెనీల భవనాల్లో కూడా రెయిడ్స్ నిర్వహించిన అనంతరం మంత్రి సంజీవ్‌ను ఈడీ అరెస్టు చేసింది.
ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మంత్రికి సంబంధించిన వారు ఫేక్ కంపెనీల సాయంతో మొబైల్ ఫోన్ కొనుగోళ్ల పేరిట నకిలీ బిల్లులను సృష్టించారు. ఈ బిల్లుల సాయంతో అక్రమంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్, జీఎస్టీ రీఫండ్స్, ఇతర ఎగుమతి ఆధారిత ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకున్నారు. ఇలా అక్రమంగా వచ్చిన డబ్బును అక్రమంగా దుబాయ్‌కు పంపించి తిరిగి భారత్‌కు తీసుకొచ్చి మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు అధికారులు ఆరోపిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రి అరెస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఆప్ నేతలు మాత్రం మంత్రి సంజీవ్ అరెస్టును ఖండిస్తున్నారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల సాయంతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు.
‘ఈ ఈడీ రెయిడ్స్ ఉద్దేశం నల్ల ధనాన్ని వెలికి తీయడమో లేక ఇతర డాక్యుమెంట్స్‌ను వెలుగులోకి తేవడమో కాదు. బీజేపీలో చేరితే ఇవన్నీ పోతాయని రెయిడ్స్ ఎదుర్కొంటున్న వారికి ఒక సంకేతం పంపించడమే అసలు లక్ష్యం’ అని పంజాబ్ ముఖ్యమంత్రి భగ్‌వంత్ మాన్ మీడియాతో అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
యూపీ మంత్రివర్గ విస్తరణ... గవర్నర్‌ను కలవనున్న యోగి ఆదిత్యనాథ్
విజయ్‌కు లైన్ క్లియర్.. మద్దతు లేఖ అందజేసిన వీసీకే