Share News

పుణె లోహగడ్ కోట హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

ABN , Publish Date - Jun 27 , 2026 | 01:45 PM

దేశవ్యాప్తంగా కలకలం రేపిన పుణె లోహగడ్ కోట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌధరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే అంశంపై పోలీసులు విచారణ చేశారు. ఈ సందర్భంగా వారికి సంచలన విషయాలు తెలిశాయి.

పుణె లోహగడ్ కోట హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
Pune Lohagad Fort Case

మహారాష్ట్ర: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె లోహగడ్ కోట హత్య కేసులో తాజాగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చేతన్ చౌధరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసులో విచారణకు హాజరైన సియా సోదరుడు సాహిల్ గోయల్, కుటుంబ సభ్యుల వాంగ్మూలం దర్యాప్తులో కీలకంగా మారింది. తన క్రికెట్ మ్యాచ్‌లకు సియా తరచుగా హాజరయ్యేదని, ఆ సమయంలోనే చేతన్ చౌధరితో ఆమెకు పరిచయం ఏర్పడిందని పోలీసులకు సాహిల్ తెలిపాడు.


అనంతరం గతేడాది దీపావళి సందర్భంగా ఓ కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలో వాళ్లిద్దరూ మళ్లీ కలుసుకున్నారని, అప్పటి నుంచి మరింత సన్నిహితంగా మెలిగారని విచారణలో వెల్లడించాడు. సియాకు పెళ్లి విషయంలో అభ్యంతరం ఉంటే తమ కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేసేవారని పోలీసులకు సాహిల్ తెలిపాడు. మరోవైపు సియా తల్లి పూజా గోయల్ మాత్రం తమ కుమార్తె ఎప్పుడూ పెళ్లిపై అసంతృప్తి వ్యక్తం చేయలేదని వెల్లడించింది. చేతన్ చౌధరిని తాను ఎప్పుడూ చూడలేదని ఆమె తెలిపింది. అయితే, సియా తరఫు న్యాయవాది మాత్రం చేతన్ ఆమెకు కేవలం స్నేహితుడేనని పేర్కొన్నారు. మరోవైపు కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సేకరించిన సియా గోయల్, చేతన్ చౌధరి కాల్ డీటెయిల్స్ సంచలనం రేపుతున్నాయి.


ఈ ఏడాది జనవరి నుంచి వారిద్దరి మధ్య ఏకంగా 2 వేలకుపైగా ఫోన్ కాల్ సంభాషణలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు వాళ్లిద్దరూ 238 గంటలకు పైగా మాట్లాడుకున్నట్లు వెల్లడైంది. దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. సియా గోయల్, చేతన్ చౌధరి తమ మొబైల్ ఫోన్లలోని వాట్సాప్ చాట్లు, ఇన్‌స్టాగ్రామ్ సంభాషణలు సహా పలు డిజిటల్ ఆధారాలను తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో రికవరీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. అంతేకాకుండా, హత్యకు ముందు రోజు (జూన్ 17న) పుణెలోని లుల్లానగర్ ప్రాంతంలోని ఓ కేఫేలో సుమారు గంటపాటు నిందితులిద్దరూ సమావేశమైనట్లు పోలీసులు కనిపెట్టారు. ఆ సమావేశంలోనే హత్యకు సంబంధించిన ప్రణాళిక రూపొందించారా? లేక మరేదైనా కీలక అంశాలపై చర్చించారా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.


కాగా, నవంబర్‌లో కేతన్ అగర్వాల్, సియా గోయల్ వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి ఇష్టం లేకపోవడంతో ప్రియుడు చేతన్‌తో కలిసి యువతి కాబోయే భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జూన్ 18న లోహగడ్ కోటకు తీసుకెళ్లి కేతన్‌ను లోయలోకి తోసి హత్య చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో సియా, చేతన్ ఇద్దరి పాత్రా స్పష్టంగా తేలిందని లోణావాలా డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గజానన్ టోంపే తెలిపారు. మరోవైపు ఈ హత్యను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే శాఖ..

పెళ్లి వేడుకలో విషాదం.. వధువు మెడలో దండ వేయబోతూ కుప్పకూలిన వరుడు..

Updated Date - Jun 27 , 2026 | 01:45 PM