Share News

ప్రశ్నపత్రాల లీకేజీ నిరోధక బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ABN , Publish Date - Jul 31 , 2026 | 05:43 AM

ప్రశ్నపత్రాల లీక్‌ ఘటనల్లో నిందితులకు కఠినమైన శిక్షలను ప్రతిపాదించే ‘పబ్లిక్‌ పరీక్షల(అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026’ను రాజ్యసభ గురువారం ఆమోదించింది. ఈ బిల్లుకు...

ప్రశ్నపత్రాల లీకేజీ నిరోధక బిల్లుకు రాజ్యసభ ఆమోదం

  • ఇప్పటికే ఆమోదముద్ర వేసిన లోక్‌సభ

  • లీకేజీలను సహించేది లేదు: మంత్రి జితేంద్రసింగ్‌

  • రాహుల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

న్యూఢిల్లీ, జూలై 30: ప్రశ్నపత్రాల లీక్‌ ఘటనల్లో నిందితులకు కఠినమైన శిక్షలను ప్రతిపాదించే ‘పబ్లిక్‌ పరీక్షల(అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026’ను రాజ్యసభ గురువారం ఆమోదించింది. ఈ బిల్లుకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ప్రకారం.. ప్రశ్నపత్రాల లీకేజీకి, అక్రమాలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా పదేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. కాగా, బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు విపక్ష సభ్యులు ప్రభుత్వ తీరును విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజీలను ఎలా ఆపాలన్నదానిపై దృష్టి పెట్టకుండా కేవలం కఠిన శిక్షలు విధించటానికి ప్రాధాన్యతనిస్తే.. లీకేజీలు ఆగవని కాంగ్రెస్‌ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. పరీక్షల వ్యవస్థను, సంబంధించిన సంస్థలను సంస్కరించి జవాబుదారీతనం తీసుకురానంత వరకూ లీకేజీలను అరికట్టలేమన్నారు. పాతబిల్లులోని శిక్షలను పెంచటం తప్ప కొత్త బిల్లులో మరేమీ లేదని, దీనివల్ల ఫలితం ఏమీ ఉండదని శివసేన (ఉద్ధవ్‌) ఎంపీ సంజయ్‌రౌత్‌ విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజీ పట్ల ప్రభుత్వం ఎంతమాత్రం ఉదాసీనత ప్రదర్శించబోదని, దీనికి తాజా బిల్లే నిదర్శమని కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ చెప్పారు. మరోవైపు, పేపర్‌ లీకేజీ బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ‘ఇడియట్స్‌’, ‘అంధభక్తులు’ అంటూ అనుచిత మాటలు మాట్లాడారని, ఆయన మీద సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలంటూ స్పీకర్‌కు బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ నోటీసును సమర్పించారు. పబ్లిక్‌ పరీక్షల సవరణ బిల్లు ఆమోదం పొందడంపై సోనమ్‌ వాంగ్‌చుక్‌ హర్షం వ్యక్తం చేశారు. పరీక్షల్లోనే కాకుండా దేశ విద్యా వ్యవస్థలో సంస్కరణలు, సమగ్ర మార్పుల దిశలో ఇది తొలి అడుగు అంటూ ఆయన ఎక్స్‌లో ఓ వీడియో సందేశం షేర్‌ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ

Updated Date - Jul 31 , 2026 | 05:43 AM