బెంగాల్‌లో రాష్ట్రపతి పర్యటన వివాదాస్పదం
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:39 AM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం పశ్చిమ బెంగాల్‌లో జరిపిన పర్యటన వివాదాస్పదమయింది. తనను కలవడానికి ముఖ్యమంత్రిగానీ, ఇతర మంత్రులుగానీ రాలేదని రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేయగా, ఆమె...
సీఎం కలవలేదని ముర్ము అసంతృప్తి
రాష్ట్రపతిని అవమానించారు: మోదీ
కోల్‌కతా, మార్చి 7: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం పశ్చిమ బెంగాల్‌లో జరిపిన పర్యటన వివాదాస్పదమయింది. తనను కలవడానికి ముఖ్యమంత్రిగానీ, ఇతర మంత్రులుగానీ రాలేదని రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేయగా, ఆమె బీజేపీ వారు చెప్పినట్టు మాట్లాడుతున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. డార్జిలింగ్ జిల్లాలో ఏర్పాటు చేసిన 9వ అంతర్జాతీయ సంతాల్ సమ్మేళనాన్ని ప్రారంభించేందుకు ఆమె రాష్ట్రానికి వచ్చారు. అయితే ఇరుకుగా ఉందన్న కారణంతో చివరి నిమిషంలో సమావేశ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చివేసిందని రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఆ స్థలాన్ని చూశానని, అక్కడ అయిదు లక్షల మంది కూర్చోవచ్చని చెప్పారు. ‘ఇది చాలా విచారకరం’ అని వ్యాఖ్యానించారు. సమావేశాన్ని బిధాన్‌నగర్ నుంచి గోసాయిపూర్‌కు మార్చడాన్ని తప్పుపట్టారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ ఇలాంటి పరిణామాలు గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. సిగ్గుచేటని విమర్శించారు. ప్రజాస్వామ్యం. గిరిజనుల సాధికారితపై విశ్వాసం ఉన్నవారు నిరాశ చెందారని వ్యాఖ్యానించారు. గిరిజన జాతికి చెందిన రాష్ట్రపతికి బాధ కలిగించడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హద్దులను దాటిందని, రాష్ట్రపతిని అగౌరవ పరిచిందన్నారు. రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్యలపై మమతా బెనర్జీ స్పందించారు. కోల్‌కతాలో ఆమె మాట్లాడుతూ బీజేపీ సలహాల మేరకు ఆమె మాట్లాడుతున్నారని అన్నారు. మణిపూర్, ఛత్తీ్‌సగఢ్‌లలో గిరిజనులపై అత్యాచారాలు జరిగినా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆమెను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరూ వెళ్లలేదనడం సరికాదని చెప్పారు. ‘‘ఆ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం లేదు. దానిని ఎవరు నిర్వహిస్తున్నారో, నిధులు ఎవరు ఇచ్చారో కూడా తెలియదు’’ అని మమత వ్యాఖ్యానించారు. ‘‘సంవత్సరానికి ఒకసారి వస్తే వెంట నేనుంటా. కానీ పదేపదే వస్తున్నారు. ప్రతి సారీ ఎలా వెళ్లగలను? గాలిపటం ఎగురవేస్తుంటే మాంజా పట్టుకొని తిరుగుతున్నట్టు తిరగలేం కాదా’’ అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
ఇకపై దాడులు చేయం... గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ