Share News

అవినీతి కట్టడితో ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తున్నాం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:17 PM

గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. అవినీతి కట్టడితో ప్రభుత్వం.. ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తోందన్నారు. ఇవాళ ఉభయసభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో పలు కీలక విషయాలు ఉన్నాయి.

అవినీతి కట్టడితో ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తున్నాం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
President Droupadi Murmu address

న్యూ ఢిల్లీ, జనవరి 28: 2026 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజైన ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి.. దేశం వికసిత్ భారత్‌ వైపు పయనిస్తోందని చెప్పారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత పదేళ్లలో పేదల కోసం 4కోట్ల ఇళ్లు కట్టించామని, జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు.


'పదేళ్లలో 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. సామాజిక న్యాయం ప్రాతిపదికన కేంద్రం పనిచేస్తోంది. వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల ద్వారా సేవలు విస్తరించాం. ప్రతి పౌరుడికి జీవిత బీమా కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. ఆయుష్మాన్ భారత్‌తో కోట్లమందికి వైద్యసేవలందిస్తున్నాం. వరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నెం1 స్థానంలో నిలిచింది. అక్వా, పాల ఉత్పత్తుల్లో భారత్ ముందంజలో ఉంది' అని రాష్ట్రపతి వెల్లడించారు.


దేశంలో స్పేస్ టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని రాష్ట్రపతి అన్నారు. భవిష్యత్‌లో అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని, జమ్మూకశ్మీర్‌లో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించామని గుర్తు చేశారు. గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్రపతి చెప్పారు.

ఇంకా రాష్ట్రపతి తన ప్రసంగంలో ఏమన్నారంటే.. 'అవినీతి కట్టడితో ప్రభుత్వ ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తోంది. GST స్లాబ్‌ల తగ్గింపుతో దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. యూరోపియన్ యూనియన్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. రూ.12లక్షల వార్షిక ఆదాయం వరకు ఆదాయపు పన్ను లేకుండా చేశాం. స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లోనూ భారత్ దూసుకెళ్తోంది. భారత్ పవర్ టెక్నాలజీ హబ్‌గా రూపొందుతోంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్‌ను పవర్ హౌస్‌గా తయారు చేస్తున్నాం. భవిష్యత్‌లో 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి చర్యలు. వికసిత్ భారత్‌లో రైతుకు అధిక ప్రాధాన్యత' ఉంటుందని రాష్ట్రపతి స్పష్టం చేశారు.


'గ్రామీణ ఉపాధి కల్పన కోసం జీ రామ్‌ జీ చట్టం తీసుకొచ్చాం. దేశాభివృద్ధిలో మహిళలకు కీలక పాత్ర కల్పించాం. ఆపరేషన్ సిందూర్.. మన సైనికుల సత్తా చాటింది. భారత్‌పై దాడిచేస్తే ఏం జరుగుతుందో ప్రపంచం చూసింది. రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతి రికార్డు స్థాయిలో పెరిగింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ డిఫెన్స్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. నానో చిప్‌ల తయారీపైనా భారత్ దృష్టి సారించింది. మైక్రో చిప్‌ల తయారీలో స్వయంసమృద్ధి సాధించాలి. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో 15లక్షల ఉద్యోగాలు సృష్టించగలిగాం. ముద్ర యోజన ద్వారా చిరువ్యాపారులకు భారీగా రుణాలు'. వంటి ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాల్ని రాష్ట్రపతి తన ప్రసంగంలో వెల్లడించారు. పీఎం విశ్వకర్మ యోజనతో 20లక్షల మందికి శిక్షణ ఇస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు.

Updated Date - Jan 28 , 2026 | 12:48 PM