ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమంలో నాలుగో అంతస్తు నుంచి పడి శిష్యుడు మృతి!
ABN , Publish Date - Sep 26 , 2026 | 05:21 PM
ఆధ్యాత్మిక వేత్త ప్రేమానంద్ జీ మహారాజ్‌కు చెందిన మథుర ఆశ్రమంలో విషాదం నెలకొంది. ఆశ్రమ భవనం నాలుగో అంతస్తు నుంచి పడి ఆయన శిష్యుడొకరు మృతి చెందారు.
మథుర, సెప్టెంబర్ 26: ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్త ప్రేమానంద్ జీ మహారాజ్‌కు చెందిన మథురలోని ఆశ్రమంలో ఈ ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బృందావన్‌లోని 'గురుకృపా కుంజ్' ఆశ్రమం నాలుగో అంతస్తు నుంచి పడి ఆయన శిష్యుడొకరు మృతి చెందారు. ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నప్పటికీ, పోలీసులు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నారు.
మృతుడిని మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన దీపక్ లోధిగా గుర్తించారు. ఆయన ఆశ్రమంలో 'రసిక్ దులారీ శరణ్' అనే పేరుతో ఉంటున్నారు. శనివారం ఉదయం దాదాపు 10:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నాలుగో అంతస్తు నుంచి కిందపడటంతో ఆయన తల, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి.
తీవ్రంగా గాయపడిన ఆయనను ఆశ్రమ ప్రతినిధులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆసుపత్రికి తరలించిన అనంతరమే ఆశ్రమ వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం భద్రపరిచారు. జబల్‌పూర్‌లో ఉన్న మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, వారు రేపు (ఆదివారం) ఉదయానికి మథుర చేరుకున్న తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.
ఇది ఆత్మహత్యా లేక దీని వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు బృందావన్ కోత్వాలి పరిధిలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కీవ్‌పై రష్యా డ్రోన్ దాడులు.. ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు
కూలిన విమానం.. ఇద్దరు లెఫ్టినెంట్ జనరల్స్ సహా 14 మంది మృతి