బీజేపీ కంచుకోట బద్దలు
ABN , Publish Date - Aug 04 , 2026 | 05:45 AM
జన్‌సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గెలుపు రుచి చూశారు. బీజేపీ కంచుకోటను బద్ధలుకొట్టి.. ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించారు. గతేడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో...
బిహార్‌లోని బాంకీపూర్‌లో ప్రశాంత్ కిశోర్ విజయం
19,324 ఓట్ల మెజారిటీతో గెలుపు
నితిన్ నబీన్ ఖాళీ చేసిన సీట్లో బీజేపీ ఓటమి
మధ్యప్రదేశ్‌లో దాటియాను నిలబెట్టుకున్న కాంగ్రెస్
గుజరాత్‌లోని మంజల్‌పూర్ మళ్లీ బీజేపీదే
న్యూఢిల్లీ, ఆగస్ట్ 3: జన్‌సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గెలుపు రుచి చూశారు. బీజేపీ కంచుకోటను బద్ధలుకొట్టి.. ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించారు. గతేడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయిప్పటికీ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖాళీ చేసిన బాంకీపూర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో, విజయంతో మంచి బోణీ కొట్టారు. నితిన్ నబీన్ కుటుంబానికి కంచుకోట అయిన స్థానాన్ని కైవసం చేసుకుని, బీహార్‌లో బీజేపీకి గట్టి సవాల్ విసిరారు. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఎదురైన తొలి ఎన్నికల సమరంలో నితిన్ నబీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. మరోవైపు గుజరాత్‌లోని మంజల్‌పూర్ స్థానాన్ని అధికార బీజేపీ నిలబెట్టుకోగా, మధ్యప్రదేశ్‌లోని దాటియా స్థానంలో ఓటర్లు కాంగ్రె్‌సకే పట్టం కట్టారు. మూడు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం విడుదల చేసింది.
ఆరంభం అదిరింది..
బాంకీపూర్ అసెంబ్లీ స్థానంలో ప్రశాంత్ కిషోర్ (పీకే) బీజేపీ అభ్యర్థి నీరజ్‌కుమార్‌పై 19,324 ఓట్ల మెజారిటీతో విజయబావుటా ఎగురవేశారు. పీకేకి 64,151 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా 44,827 ఓట్లు సాధించారు. ఈ ఒక్క గెలుపు ప్రశాంత్ కిషోర్‌కు వెయ్యి ఎనుగుల బలాన్నిచ్చిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
బీజేపీకి కంచుకోట!
2008 డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత బాంకీపూర్ స్థానం ఏర్పాటైంది. అప్పటి వరకు దీన్ని పాట్నా వెస్ట్‌గా పరిగణించే వారు. పట్టణ స్థానమైన ఇక్కడ విద్యావంతులు ఎక్కువ. 1995 నుంచి 2006 వరకు పాట్నావెస్ట్ స్థానానికి నితిన్ నబీన్ తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా ప్రాతినిధ్యం వహించారు. 2006లో ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికలో నితిన్ నబీన్ మొదటిసారి గెలిచారు. బాంకీపూర్ ఏర్పాటైన తర్వాత కూడా 2008, 2010, 2015, 2020, 2025లో నబీన్‌కే ఓటర్లు పట్టం కడుతూ వచ్చారు. నబీన్ ఈ ఏడాది జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతల చేపట్టిన అనంతరం, బాంకీపూర్ స్థానానికి రాజీనామా సమర్పించారు.

బీజేపీకి తగిన సందేశం ఇచ్చారు: పీకే
తనను గెలిపించడం ద్వారా ‘బీహార్ రాష్ట్రానికి ఒక మంచి నేతను ముఖ్యమంత్రిగా నియమించాలి’ అన్న సందేశాన్ని బీజేపీ అగ్రనాయకత్వానికి ఓటర్లు పంపారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఓటర్లు తనపై చూపించిన విశ్వాసాన్ని గౌరవించి, బాంకీపూర్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని ప్రకటించారు. ఉప ఎన్నిక ఫలితాన్ని గౌరవిస్తామని బీజేపీ రాష్ట్ర మంత్రి విజయ్ కుమార్ సిన్హా ప్రకటించారు.
దాటియాలో కాంగ్రె్‌సకే అభయహస్తం
మధ్యప్రదేశ్‌లోని దాటియా అసెంబ్లీ స్థానంలో ఓటర్లు కాంగ్రె్‌సకే పట్టం కట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ 6,016 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 66,757 ఓట్లు లభించగా, బీజేపీ నేత అశుతోష్ తివారీ 60,741 ఓట్లు సాధించారు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతీని.. గ్రామీణ సహకార బ్యాంకుకు సంబంధించి మోసం కేసులో కోర్టు దోషిగా ప్రకటించడంతో అనర్హతకు గురయ్యారు. దీంతో నిర్వహించిన ఉప ఎన్నికలో ఓటర్లు తిరిగి కాంగ్రె్‌సకే పట్టం కట్టడం విశేషం. మరోవైపు గుజరాత్‌లోని మంజల్‌పూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సతీష్ గోవింద్‌భాయ్ పటేల్ 30,630 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి భికన్‌భాయ్ రబారిపై గెలిచారు. పటేల్‌కు 55,481 ఓట్లు రాగా, రబారి 24,851 ఓట్లు సాధించారు. సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ పటేల్ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..