హైదరాబాద్ చండీగఢ్ విమానంలో పేలిన పవర్ బ్యాంక్
ABN , Publish Date - May 06 , 2026 | 06:09 AM
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చండీగఢ్‌కు వెళ్లిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో...
చండీగఢ్‌లో విమానం ల్యాండైన కాసేపటికే ఘటన
ప్రయాణికులు సురక్షితం, ఓ మహిళకు గాయాలు
శంషాబాద్ రూరల్, మే 5(ఆంధ్రజ్యోతి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చండీగఢ్‌కు వెళ్లిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఓ ప్రయాణికుని వద్ద ఉన్న పవర్ బ్యాంకు పేలి విమానమంతా మంటలు, పొగ వ్యాపించాయి. దీంతో అత్యవసర ద్వారాన్ని తెరిచి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపారు. ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలయ్యాయి. ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 200 మంది ప్రయాణికులతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం మంగళవారం మధ్యాహ్నం 1.25 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో బయలుదేరి 3.29 గంటలకు చండీగఢ్‌లోని షహీద్ భగత్‌సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానం ల్యాండైన తర్వాత ‘బే’ వైపు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలతో పొగ వచ్చింది. క్షణాల్లో విమానమంతా పొగ వ్యాపించి లోపల ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే, అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర ద్వారాలను తెరిచి గాలితో నింపిన స్లైడ్‌ల ద్వారా ప్రయాణికులను కిందకు దింపారు. ఈ సమయంలో జరిగిన తోపులాటల్లో ఓ ప్రయాణికురాలికి గాయాలయ్యాయి. ఓ ప్రయాణికుడు తనకు ఎదురుగా ఉన్న సీటు వెనుక చిన్నచిన్న వస్తువులు పెట్టుకునేందుకు ఉండే పౌచ్‌లోనే పవర్ బ్యాంక్ పెట్టారని, అదే పేలి మంటలు, పొగ వచ్చాయని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్
ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్