ఎరువులు, ఇంధన కొరత రాకూడదు
ABN , Publish Date - Jul 31 , 2026 | 05:40 AM
పశ్చిమాసియాలో నాలుగు నెలలకు పైగా కొనసాగుతున్న ఘర్షణలు మరింత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అత్యవసరంగా భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ...
ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వేగంగా పెంచాలి
గల్ఫ్‌లోని భారతీయుల క్షేమానికి చర్యలు చేపట్టాలి
భారతీయ నావికా సిబ్బంది రక్షణ కూడా ముఖ్యమే
అన్ని శాఖలు ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలి
అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు
వచ్చే ఖరీఫ్ వరకు ఎరువులకు లోటు లేదు
సీసీఎస్ కు వివరించిన క్యాబినెట్ సెక్రటరీ
న్యూఢిల్లీ, జులై 30(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో నాలుగు నెలలకు పైగా కొనసాగుతున్న ఘర్షణలు మరింత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అత్యవసరంగా భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశం నిర్వహించారు. ఈ సంక్షోభం వల్ల పడే ప్రభావం, వివిధ శాఖల సన్నద్ధతను ఈ సందర్భంగా సమీక్షించారు. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల వల్ల ముడి చమురు, ఎరువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు. ముఖ్యంగా రాబోయే రబీ సీజన్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. పెట్రోలియం రంగాన్ని మరింత స్వయం సమృద్ధంగా (స్వావలంబన) మార్చాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సౌర శక్తితోపాటు, శిలాజేతర ఇంధన వనరులు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను వేగంగా పెంచడం ద్వారా సంక్షోభాల వల్ల వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చని స్పష్టం చేశారు. నేషనల్ గ్యాస్ గ్రిడ్ విస్తరణను వేగవంతం చేయడం, పైపుల ద్వారా దేశవ్యాప్త సహజ వాయువు సరఫరాకు (పీఎన్‌జీ) మౌలిక సదుపాయాలను విస్తరించడం ద్వారా ఎల్‌పీజీపై ఆధారపడడాన్ని తగ్గించొచ్చని చెప్పారు. ఘర్షణ ప్రాంతాల్లో స్వదేశీ, విదేశీ నౌకల్లోని భారతీయ సిబ్బంది భద్రతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. నావికా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌తోపాటు, అత్యవసర సాయం, సకాలంలో సమాచారం అందించేందుకు వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గల్ఫ్ దేశాల్లో నివసించే ప్రవాస భారతీయుల ప్రాణ రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వంలోని అన్ని విభాగాలు ఒకే తాటిపైకి వచ్చి పనిచేయాలని, దేశ ప్రజలపై పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కాగా, ప్రస్తుతానికి దేశంలో ఇంధన కొరత లేదని, రబీతోపాటు వచ్చే ఖరీఫ్ సీజన్‌లో కూడా ఎరువులకు లోటు ఉండదని అధికారులు స్పష్టం చేసినట్టు సమాచారం. భౌగోళిక రాజకీయ పరిస్థితులపై సీసీఎ్‌సకు కేబినెట్ సెక్రటరీ సమగ్రంగా వివరించారు. పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ సరఫరాకు ఎలాంటి లోటు లేదని తెలిపారు. ప్రభుత్వ రంగంలోని చమురు రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని వివరించినట్లు తెలిసింది. పశ్చిమాసియాలో సుమారు కోటి మంది భారతీయులు నివసిస్తుండగా.. అధిక శాతం సౌదీ అరేబియా, యూఏఈలోనే ఉపాధి రీత్యా స్థిరపడ్డారు. ఏటా వారు మాతృదేశానికి పెద్ద మొత్తంలో నిధులను కూడా (రెమిటెన్స్) పంపిస్తుంటారు. ఈ తరుణంలో ప్రధాని సూచనలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ వార్తలనూ చదవండి:
కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి
కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ