ప్రజాస్వామ్యానికి భారత్ మాతృభూమి!
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:36 AM
ప్రజాస్వామ్యానికి.. భారత్ మాతృభూమి వంటిదని, ఏ విషయంపైనైనా దేశ ప్రజలు స్వేచ్ఛగా చర్చిస్తారని ప్రధాని మోదీ అన్నారు. ప్రభుత్వానికి అధికారం ఉన్నప్పటికీ దాని లక్ష్యం.. పౌరులను వ్యవస్థలపై ఆధారపడేలా చేయడం కాదని తెలిపారు.
ప్రభుత్వం తన అధికారాన్ని ఎలా వినియోగిస్తోందన్నది అత్యంత కీలకం
ప్రపంచస్థాయి ఆర్థిక శక్తిగా దేశం మారుతోంది
ఎవరికీ నష్టం కలిగించకుండా ఎదుగుతున్నాం
ప్రమాదంలో ప్రపంచీకరణ: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, అక్టోబరు 13: ప్రజాస్వామ్యానికి.. భారత్ మాతృభూమి వంటిదని, ఏ విషయంపైనైనా దేశ ప్రజలు స్వేచ్ఛగా చర్చిస్తారని ప్రధాని మోదీ అన్నారు. ప్రభుత్వానికి అధికారం ఉన్నప్పటికీ దాని లక్ష్యం.. పౌరులను వ్యవస్థలపై ఆధారపడేలా చేయడం కాదని తెలిపారు. బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ సదస్సులో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘దేశంలో 100కు పైగా భాషలు మాట్లాడేవారు ఉన్నారు. సుమారు 80 వేల రిజిస్టర్డ్ వార్తా పత్రికలు, పబ్లికేషన్లు ఉన్నాయి. వెయ్యికిపైగా శాటిలైట్ టెలివిజన్ చానెళ్లు కూడా ఉన్నాయి. ఇదొక్కటే కాదు.. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో 50 కోట్ల మంది యూట్యూబ్ వినియోగదారులు, మరో 50 కోట్ల మంది ఇన్స్టా వినియోగదారులు ఉన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పేందుకు, చర్చించేందుకు డిజిటల్ వేదికలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.’’ అని పేర్కొన్నారు. జ్ఞానం, సంపద, అధికారం ఎవరి వద్ద ఉన్నా.. వాటిని ఎలా వినియోగిస్తారన్నది అత్యంత కీలకమని, అదే నిజమైన విలువలను ప్రబోధిస్తుందని వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపిన మరుసటి రోజు ప్రధాని ‘స్వేచ్ఛ’ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరు అంతర్జాతీయ మీడియాలో హెడ్లైన్స్లో వచ్చింది. సుప్రీంకోర్టు న్యాయవాదులు, జర్నలిస్టులు, ఐక్యరాజ్యసమితి సైతం పోలీసుల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి.
ప్రపంచంతో కలిసి...
ప్రపంచస్థాయి ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందని, ఈ క్రమంలో ఎవరికీ నష్టం కలిగించకుండా ప్రపంచ దేశాలతో కలిసి పనిచేస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఇతర దేశాలకు నష్టం కలిగించకుండా, అవి కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే దేశంగా భారత్ ఉందన్నారు. ‘‘ప్రపంచం కోసం.. ప్రపంచంతో కలిసి ఎదుగుతాం’’ అని ప్రధాని అన్నారు.
వాటినే ఆయుధాలుగా..
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కొన్ని పరిస్థితులు ప్రపంచీకరణను ప్రమాదంలోకి నెడుతున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది.. ప్రపంచ దేశాలను వ్యూహాత్మక బలహీనతకు గురి చేస్తోందని హెచ్చరించారు. ‘‘సరఫరా వ్యవస్థలు, ఇంధనం, కీలక ఖనిజాలు, చెల్లింపుల వ్యవస్థ, సాంకేతికత వంటివి భౌగోళిక రాజకీయ ఒత్తిడి సాధనాలుగా మారుతున్నాయి. ఇది ప్రపంచీకరణను, ఆయా దేశాలను వ్యూహాత్మక బలహీనతలకు గురిచేస్తోంది. ఒకప్పుడు ప్రపంచ దేశాలను కలిపిన అంశాలనే.. ఇప్పుడు ఆయుధాలుగా మారుస్తున్నారు.’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
సీఈసీ రాజీనామా చేయకుంటే అభిశంసన తప్పదు.. ఎంపీ శశిథరూర్ హెచ్చరిక
నాసా–స్పేస్ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ఐ ఎస్ ఎస్ కు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక