కిందున్న త్రివర్ణ పతాకం మార్కర్.. తీసి జేబులో పెట్టుకున్న ప్రధాని
ABN , Publish Date - Nov 17 , 2026 | 08:04 PM
ఆసియాన్ సమావేశాల సందర్భంగా క్వాడ్ కూటమి దేశాధినేతల గ్రూప్ ఫొటో తీసే సమయంలో ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది.
ఇంటర్నెట్ డెస్క్: త్రివర్ణ పతాకం తనకు ఎంతో గర్వకారణమని ప్రధాని మోదీ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. తనను ముందుకు నడిపించే స్ఫూర్తి అదేనని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో ఆసియాన్ సమావేశాల సందర్భంగా క్వాడ్ కూటమి దేశాధినేతల గ్రూప్ ఫొటో తీసే సమయంలో ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. నేల మీద ఉన్న త్రివర్ణ పతాకం మార్కర్‌ను చూసిన మోదీ వెంటనే దాన్ని తీసి తన జేబులో పెట్టుకున్నారు. ఈ దృశ్యాన్ని జపాన్ ప్రధాని తకాయిచీ, అమెరికా అధ్యక్షుడు ఆసక్తిగా వీక్షించారు.
గ్రూప్ ఫొటో దిగేందుకు దేశాధినేతలు స్టేజీపై నిలబడాల్సి ఉంది. అయితే, ఎవరెక్కడ నిలబడాలో చెప్పేందుకు నేల మీద చిన్న కాగితపు మార్కర్లను పెట్టారు. వాటిపై ఆయా దేశాల జాతీయ జెండాల చిత్రాలు కూడా ఉన్నాయి. స్టేజీపై నిలబడ్డాక ప్రధాని మోదీ ఆ మార్కర్‌ను చూశారు. వెంటనే ముందుకు వంగి కాగితాన్ని తీసుకున్ని జేబులో పెట్టుకున్నారు. ఈ దృశ్యాన్ని జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాధినేతలు ఆసక్తిగా చూశారు. జాతీయ జెండాను అలాగే కింద వదిలిపెట్టలేకపోయానని మోదీ వారితో అంటే అది మంచి నిర్ణయమేనని ట్రంప్ బదులిచ్చారు.
కాగా, జోహాన్నెస్‌బర్గ్‌లో 2023 నాటి బ్రిక్స్ సమావేశాల్లో కూడా ఇలాగే జరిగింది. కింద ఉన్న త్రివర్ణ పతాకం మార్కర్‌ను ప్రధాని మోదీ తీసి తన వద్ద పెట్టుకున్నారు. ఇక తాజాగా సమావేశంలో క్వాడ్ కూటమి గురించి మాట్లాడిన ప్రధాని మోదీ అది ఒక నిర్మాణాత్మకమైన, విశ్వసనీయమైన భాగస్వామ్యమని కొనియాడారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో దేశాల సహకారం పెంపొందించుకునేందుకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
మోదీ చాలా టఫ్.. మళ్లీ ట్రంప్ ప్రశంసలు
అమెరికా భీకర దాడులు చేసినా.. చెక్కుచెదరని ఇరాన్ రహస్య క్షిపణి నగరాలు..