Share News

రఘు రాయ్ మరణం.. ప్రధాని మోదీ నివాళులు

ABN , Publish Date - Apr 27 , 2026 | 09:39 AM

రఘు రాయ్ మరణంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సోమవారం ఎక్స్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు. రఘు రాయ్ భారతదేశ జీవనశైలిని తన కెమెరా ద్వారా అద్భుతంగా బంధించిన క్రియేటివ్ దిగ్గజంగా గుర్తుండిపోతారని ప్రధాని పేర్కొన్నారు.

రఘు రాయ్ మరణం.. ప్రధాని మోదీ నివాళులు
Prime Minister Narendra Modi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ప్రముఖ భారతీయ ఫోటో జర్నలిస్ట్ రఘు రాయ్ నిన్న (ఆదివారం) కన్నుమూసిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ మహమ్మారితో పాటు వృద్ధాప్య సంబంధిత సమస్యల కారణంగా 83 ఏళ్ల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోయారు. రఘు రాయ్ మరణంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సోమవారం ఎక్స్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు. రఘు రాయ్ భారతదేశ జీవనశైలిని తన కెమెరా ద్వారా అద్భుతంగా బంధించిన క్రియేటివ్ దిగ్గజంగా గుర్తుండిపోతారని ప్రధాని పేర్కొన్నారు. మోదీ తన పోస్టులో..


‘రఘు రాయ్ ఫోటోగ్రఫీలో అసాధారణమైన సున్నితత్వం, వైవిధ్యం ఉండేవి. ఆయన ఫొటోగ్రఫీ భారతదేశంలోని వివిధ జీవన పార్శ్వాలను ప్రజలకు చేరువ చేసింది. రఘు రాయ్ మరణం ఫొటోగ్రఫీ, సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటు. ఈ విషాదకర సమయంలో నా ఆలోచనలు ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు, ఫోటోగ్రఫీ రంగానికి చెందిన వారితో ఉన్నాయి. ఓం శాంతి’ అని రాసుకొచ్చారు.


రఘు రాయ్ నేపథ్యం ఇది..

రఘు రాయ్ 1942లో పంజాబ్‌లోని ఝంగ్‌లో జన్మించారు. సివిల్ ఇంజినీరింగ్ చేసిన ఆయన 23 ఏళ్ల వయసులోనే ఫొటోగ్రఫీ వైపు వచ్చారు. ‘ద స్టేట్స్‌మన్’ వార్తా పత్రికలో ఫొటోగ్రాఫర్‌గా చేరారు. దాదాపు 60 ఏళ్ల పాటు ఫొటోగ్రాఫర్‌గా కొనసాగారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలను ఆయన తీశారు. దేశంలో చోటుచేసుకున్న ఎన్నో ముఖ్య ఘట్టాలను, విషాదాలను తన కెమెరాతో బంధించారు. దలైలామా, మదర్ థెరీసా, సత్యజిత్ రే, హరి ప్రసాద్ చౌరాసియా, బిస్మిల్లా ఖాన్ వంటి ప్రముఖుల జీవితాల్లోని అరుదైన కోణాలను కెమెరాతో స్పృశించారు.


ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ ఏడాది చివరి నుంచి అమల్లోకి..

విరాట్ సిక్సర్ల సంఖ్య 300 అధిగమించడం అద్భుతం: మహ్మద్ కైఫ్

Updated Date - Apr 27 , 2026 | 11:43 AM