మహిళల కలలను చిదిమేశారు: విపక్షాలపై ప్రధాని మోదీ నిప్పులు!
ABN , Publish Date - Apr 18 , 2026 | 08:38 PM
మహిళా సాధికారతపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందకపోవడానికి విపక్షాల వైఖరే కారణమన్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: మహిళా సాధికారతపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇవాళ (శనివారం రాత్రి) జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన, పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందకపోవడానికి విపక్షాల వైఖరే కారణమని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
మహిళా రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా విపక్షాలు చారిత్రక తప్పిదం చేశాయని ప్రధాని అన్నారు. రాజకీయ స్వార్థం కోసమే వారు ఈ బిల్లును వ్యతిరేకించారని, వారి ద్వంద్వ ప్రమాణాలను దేశం మొత్తం గమనిస్తోందని దుయ్యబట్టారు. 'దేశంలోని తల్లులకు, సోదరీమణులకు నేను క్షమాపణలు చెబుతున్నాను. ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింపజేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించింది, కానీ కొందరి రాజకీయ ప్రయోజనాల వల్ల అది సాధ్యపడలేదు' అని మోదీ ఉద్వేగంగా పేర్కొన్నారు. భారతదేశం 'వికసిత్ భారత్'గా మారాలంటే నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం అత్యవసరమని, ఈ లక్ష్యం నెరవేరే వరకు తమ పోరాటం ఆగదని ఆయన చెప్పుకొచ్చారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంపై ప్రధాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది మంది మహిళల దశాబ్దాల కలను విపక్షాలు తమ స్వార్థ రాజకీయాల కోసం బలిచేశాయని మండిపడ్డారు. 'భారతీయ మహిళల చిరకాల స్వప్నాన్ని సాకారం చేయలేకపోయాను. బిల్లు వీగిపోవడం నన్ను ఎంతో కలిచివేసింది. మహిళలంటే ప్రతిపక్షాలకు ఎంత చులకన భావం ఉందో నేడు దేశం మొత్తం చూసింది' అని మోదీ అన్నారు.
బిల్లు ఓడిపోవడాన్ని చూసి విపక్షాలు సంబరాలు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని, ఇది దేశ మహిళలను అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు. వారికి దేశ ప్రయోజనాల కంటే రాజకీయ లబ్దే వారికి ముఖ్యమని విమర్శించారు. 'మహిళల కలలను చిదిమేసిన వారికి దేశంలోని నారీశక్తి తగిన శిక్ష వేస్తుంది. ఈ పాపానికి విపక్షాలు మూల్యం చెల్లించుకోక తప్పదు. మహిళలే వారికి బుద్ధి చెప్పాలి' అని ప్రధాని పిలుపునిచ్చారు. విపక్షాలు స్వార్థ రాజకీయాలతో అడ్డుపడినా, తమ ప్రభుత్వం మాత్రం ఎప్పుడూ దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని మోదీ స్పష్టం చేశారు.
విపక్షాలపై ప్రధాని మోదీ నిప్పులు!
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ వంటి పార్టీలు మహిళా రిజర్వేషన్ల విషయంలో 'భ్రూణహత్య'కు పాల్పడ్డాయని, అంటే ఆ ఆశయాలను మొగ్గలోనే తుంచేశాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలనే రాజ్యాంగ స్ఫూర్తిని విపక్షాలు అవమానించాయని మోదీ ధ్వజమెత్తారు. దేశ మహిళల హక్కులను కాలరాసేలా వారి ప్రవర్తన ఉందని మండిపడ్డారు.
ప్రతిసారీ మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని, మహిళల పట్ల ఆ పార్టీ తన బుద్ధిని మార్చుకోలేదని విమర్శించారు. 'మహిళలకు కొత్త దశ, దిశ చూపించాలన్నదే మా సంకల్పం. 2029 ఎన్నికల నుంచే ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని మేము ప్రణాళిక సిద్ధం చేశాం. కానీ విపక్షాలు దాన్ని అడ్డుకున్నాయి' అని మోదీ స్పష్టం చేశారు. ఉత్తర, దక్షిణ, ఈశాన్య ప్రాంతాలనే భేదం లేకుండా దేశవ్యాప్తంగా మహిళలందరికీ మేలు చేయాలనే సంకల్పంతో ఈ బిల్లును తెచ్చినట్లు ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి
కేఎల్ రాహుల్, స్టబ్స్ హాఫ్ సెంచరీలు.. ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
నారీ శక్తికి కాంగ్రెస్ ద్రోహం చేసింది.. మహేశ్వర్ రెడ్డి ధ్వజం