రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం రోజున ఒడిశాలో భారీగా అభివృద్ధి ప్రాజెక్టులు
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:17 PM
ఒడిశా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం దాదాపు రూ. 47,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం రోజే ఈ కార్యక్రమాలు జరగడం విశేషం.
మయూర్‌భంజ్(ఒడిశా), జూన్ 20: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో జరిగిన 'వికాస్ రా ధారా, ఒడిశా సారా' బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒడిశా సర్వతోముఖాభివృద్ధి కోసం దాదాపు రూ.47,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం రోజే ఈ కార్యక్రమం జరగడం విశేషం.
పహాడ్‌పూర్‌ను 'సోలార్ విలేజ్'గా ప్రకటన
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం సందర్భంగా ఆమె స్వగ్రామమైన పహాడ్‌పూర్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. ఈ గ్రామాన్ని వేగంగా అభివృద్ధి చేసి 'సోలార్ విలేజ్'గా మారుస్తామని ఆయన ప్రకటించారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికీ సౌరశక్తి అందుతుంది. ఒడిశాలోని ప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయానికి ఉన్న గుర్తింపు తరహాలోనే, పహాడ్‌పూర్ గ్రామం కూడా ప్రపంచపటంలో పునరుత్పాదక ఇంధన కేంద్రంగా సరికొత్త గుర్తింపును పొందుతుందని ప్రధాని పేర్కొన్నారు.
పారిశ్రామిక ప్రగతి, 'ఉత్కర్ష్ ఒడిశా'
ఒడిశాలోని సహజ వనరులను ఆర్థిక అవకాశాలుగా మార్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ప్రధాని తెలిపారు. రాష్ట్రంలో భారీగా పారిశ్రామిక వృద్ధి జరుగుతోందని, అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో 'ఉత్కర్ష్ ఒడిశా' ప్రచారం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గిరిజన యువతకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలను అందించడం ద్వారా వారిని సాధికారత వైపు నడిపించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ పునరుద్ఘాటించారు. గిరిజన పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు దేశవ్యాప్తంగా సుమారు 500 ఏకలవ్య మోడల్ స్కూళ్లను ప్రారంభించామని తెలిపారు.
సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం
అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ కలిసి పహాడ్‌పూర్ గ్రామంలోని 'సంతాలీ జాహిరా', 'హో జాహిరా' అనే పవిత్ర వనాలలో సంప్రదాయ పూజలు, ఆచారాలు నిర్వహించి దేశ శ్రేయస్సు కోసం ప్రార్థించారు. ప్రస్తుతం ఒడిశాలో పండుగ వాతావరణం నెలకొందని, గత వారమే 'గాన్ పర్దా' పండుగను ఘనంగా జరుపుకున్నారని, అలాగే జగన్నాథ రథయాత్ర, బరిపడ రథయాత్ర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. ఈ ఉత్సవాల మధ్య 'ప్రజాస్వామ్యం, అభివృద్ధి' అనే పండుగ కూడా ఇక్కడ నడుస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం!
ఫిఫా ప్రపంచ కప్2026: మెస్సిపై ఫిఫాకు అల్జీరియా ఫిర్యాదు