Share News

డ్రగ్స్‌ ఉత్తేజం క్షణికం.. మూల్యం ఓ జీవితం!

ABN , Publish Date - Aug 03 , 2026 | 05:45 AM

‘మాదకద్రవ్యాలు తాత్కాలిక ఉత్తేజాన్ని ఇవ్వొచ్చు కానీ...అవి జీవితం మొత్తాన్నీ నాశనం చేస్తాయి..’ అని ప్రధాని మోదీ యువతను హెచ్చరించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ దేశాభివృద్ధిలో...

డ్రగ్స్‌ ఉత్తేజం క్షణికం.. మూల్యం ఓ జీవితం!

యువత దూరంగా ఉండాలి

  • ‘డ్రగ్స్‌ రహిత యువత’ కార్యక్రమం

ప్రారంభంలో ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ, ఆగస్టు 2: ‘మాదకద్రవ్యాలు తాత్కాలిక ఉత్తేజాన్ని ఇవ్వొచ్చు కానీ...అవి జీవితం మొత్తాన్నీ నాశనం చేస్తాయి..’ అని ప్రధాని మోదీ యువతను హెచ్చరించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఈ మేరకు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ‘మాదకద్రవ్య రహిత యువత’ ఉద్యమాన్ని (నషా ముక్త్‌ యువ ఫర్‌ వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ అభియాన్‌) ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘యువతే మన దేశ భవిష్యత్తు’’ అన్నారు. వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని, దీనికోసం డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌ వ్యసనం వల్ల వ్యక్తిగత జీవితంతోపాటు, కుటుంబం కూడా పూర్తిగా అధోగతిపాలవుతుందని చెప్పారు. మత్తుపదార్థాలకు బానిసలైన వారి పట్ల సామాజిక వివక్ష తగదన్నారు. ఆ వ్యసనం నుంచి బయటపడేవారు పోరాట యోధులని అన్నారు. యోగా, ధ్యానం ద్వారా డ్రగ్స్‌ అలవాటు నుంచి బయటపడొచ్చని మన సంస్కృతి తెలియజేస్తోందని పేర్కొన్నారు.

100 వారాలు.. 100 అడుగులు..

డ్రగ్స్‌ వ్యసనం శరీరాన్ని గుల్ల చేయడమే కాకుండా.. తల్లి చిరునవ్వుని దూరం చేస్తుందని, తండ్రి కలలను ఛిన్నాభిన్నం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సోదరి ఆశలను, సోదరుడి గౌరవాన్ని హరిస్తుందన్నారు. ఈ రోజు మాదకద్రవ్య రహిత యువత ఉద్యమం ప్రారంభమైందని, దేశవ్యాప్తంగా 100 వారాలపాటు కొనసాగుతుందని చెప్పారు. రాబోయే 100 ఆదివారాలు మాదకద్రవ్య రహిత భారతం దిశగా 100 బలమైన అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో భాగంగా వచ్చే 100 ఆదివారాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్రీడాపోటీలు, వాకథాన్‌లు, ధ్యానం శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు, నాటకాలు, చర్చా వేదికలు, చిత్రలేఖన పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహించి మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటంలో ప్రభుత్వం యువతకు అండగా నిలబడుతుందని ప్రధాని హామీ ఇచ్చారు. సమాజంలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో తల్లిదండ్రులు తమ పిల్లల వ్యసనాలను దాచొద్దని చెప్పారు. వారితో స్వేచ్ఛగా మాట్లాడాలని, అసవరమైతే ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు నిపుణుల సహాయం పొందాలని సూచించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

Updated Date - Aug 03 , 2026 | 05:45 AM