Share News

ప్రశ్నించడమే కాదు.. పరిష్కారాలు వెతకండి

ABN , Publish Date - Aug 09 , 2026 | 05:34 AM

యువతరం ప్రతి సమస్య గురించి ప్రశ్నించటంతో ఆగకుండా.. ఆ సమస్యలకు పరిష్కారాలను కూడా వెదకాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘‘ప్రతి తరానికీ దేశంపట్ల నిర్వహించాల్సిన...

ప్రశ్నించడమే కాదు.. పరిష్కారాలు వెతకండి

  • సవాళ్ల నుంచి అవకాశాలను ఒడిసి పట్టండి

  • జెన్‌జీ తరం దేశంపట్ల బాధ్యతనూ నెరవేర్చాలి

  • నిత్యం నేర్చుకుంటేనే గెలుస్తారు

  • ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో మోదీ

న్యూఢిల్లీ, ఆగస్టు 8: యువతరం ప్రతి సమస్య గురించి ప్రశ్నించటంతో ఆగకుండా.. ఆ సమస్యలకు పరిష్కారాలను కూడా వెదకాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘‘ప్రతి తరానికీ దేశంపట్ల నిర్వహించాల్సిన బాధ్యతలుంటాయి. ప్రస్తుత యువత కూడా ఆ బాధ్యతలను నెరవేర్చాలి. దేశ సమగ్ర అభివృద్ధి సాధనను మీ లక్ష్యాల్లో భాగం చేసుకోండి. జెన్‌జీ తరం సామర్థ్యంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వికసిత భారత్‌ సాధనలో దేశానికి వారి అవసరం ఎంతో ఉంది’’ అన్నారు. ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని శనివారం మాట్లాడారు. ‘విద్యా సంస్థ నుంచి డిగ్రీ పట్టా తీసుకొని బయటి ప్రపంచంలోకి వెళ్తున్న యువత ఇక నేర్చుకోవటం అయిపోయిందని అనుకోవద్దు. మరో 20-30 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందువల్ల నిత్యం కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే విజేతలుగా నిలవగలరు’ అని అన్నారు. కాక్రోచ్‌ల ఉద్యమం తర్వాత జెన్‌జీని ఉద్దేశించి బహిరంగ వేదిక నుంచి మోదీ మాట్లాడటం ఇదే తొలిసారి. విద్యార్థులనుద్దేశించి ప్రధాని సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ హాలులోని ప్రతి ఒక్కరిలో ఉత్సుకత కనిపిస్తోంది. కానీ, గ్రాడ్యుయేట్ల బుర్రల్లో వేరే ఏదో ఉంది. నేను బాబా భాగేశ్వర్‌ను కాను. కానీ, వారి బుర్రల్లో ఉన్నదాన్ని చెప్పగలను. తొలి జాబ్‌ ఆఫర్‌.. అందుకోబోయే వేతనానికి సంబంధించిన ప్రశ్నలు వారి మెదళ్లను తొలుస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం అవార్డులకు ఎంపికయినవారికి బహుమతులు ప్రదానం చేశారు. విజేతల్లో విద్యార్థిని ఒకరిద్దరే ఉండటాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. స్టెమ్‌ కోర్సుల్లో అమ్మాయిల భాగస్వామ్యం పెరగాలన్నారు.

జెన్‌జీకి చేరువయ్యేందుకు స్నాప్‌చాట్‌లోకి విదేశాంగ శాఖ

జెన్‌జీకి మరింత చేరువయ్యేందుకు కేంద్ర విదేశాంగ శాఖ (ఎంఈఏ) మరో ముందడుగు వేసింది. యువత ఎక్కువగా వినియోగించే సోషల్‌ మీడియా యాప్‌ అయిన ‘స్నాప్‌చాట్‌’లో తాజాగా తన అధికారిక చానెల్‌ను ప్రారంభించింది. సోషల్‌ మీడియా వేదికగా యువతతో మమేకమవ్వాలని ప్రధాని మోదీ ఇటీవల కేంద్ర మంత్రులకు సూచించిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..

డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ

Updated Date - Aug 09 , 2026 | 06:18 AM