మీకు ఎంత ఇచ్చినా సరిపోదు.. భారత కార్పొరేట్ దిగ్గజాలపై ప్రధాని ఫైర్
ABN , Publish Date - Nov 19 , 2026 | 08:21 PM
ప్రభుత్వం ఇస్తున్న పన్ను రాయతీలను ప్రజలకు చేరకుండా కార్పొరేట్లు తమ జేబుల్లో వేసుకుంటున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వం ఇస్తున్న పన్ను రాయితీలను ప్రజలకు చేరకుండా కార్పొరేట్లు తమ జేబుల్లో వేసుకుంటున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఉద్యోగాలను సృష్టించట్లేదని, వేతనాలు పెంచట్లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో నేడు జరిగిన ఫిక్కీ సమావేశంలో ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
2014లో 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును ప్రభుత్వం 2019 నాటికి 22 శాతానికి తగ్గించిందని ప్రధాని గుర్తు చేశారు. అంతేకాకుండా, రూ.12 లక్షల లోపు ఆదాయంపై పన్ను లేకుండా చేశామని అన్నారు. కానీ ప్రభుత్వ చర్యలకు అనుగుణంగా కార్పొరేట్లు తమ వంతు చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తు కూడా ఇలాగే కొనసాగుతుందా? అని నిలదీశారు.
వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని ప్రధాని తెలిపారు. కానీ కార్పొరేట్ వర్గాల నుంచి మాత్రం ప్రశంసలు రాలేదని చెప్పారు. ‘మీరు మెచ్చుకోరన్న విషయం నాకు బాగా తెలుసు. మీకు ఎంత ఇచ్చినా సరిపోదు. మీ ఉద్యోగుల జీతాలు పెంచారా? కొత్త ఉద్యోగాలు కల్పించారా? లేదు! మోదీజీ.. మీరు చేసేది చేయండి మేము మాత్రం అలా చూస్తూ ఉంటాము అన్నట్టు మీ తీరు ఉంటుంది’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
భారతీయ కుటుంబాల్లో వినియోగం పెంచేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని కూడా ప్రధాని మోదీ తెలిపారు. పన్ను భారాన్ని తగ్గించామని చెప్పారు. దీంతో, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని అన్నారు. ఇప్పుడు వ్యాపారులకు పన్ను రిఫండ్స్ వారం లోపలే అందుతున్నాయని చెప్పారు. ‘ట్యాక్స్ రిటర్న్స్ వ్యవస్థను సులభతరం చేశాము. గతంలో 8 నెలల తరువాత గానీ మీకు ఇందుకు సంబంధించిన లేఖలు అందేవి కావు. ఇప్పుడు వారం లోపలే అందుతున్నాయి. అవునా? కాదా? కనీసం ఇప్పుడైనా చప్పట్లు కొట్టండి’ అంటూ ప్రధాని మోదీ చురకలంటించారు.
ఈ వార్తలనూ చదవండి:
చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టివేత.. రూ.710 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..
నైలాన్ తాడుతో చిన్నారి చేతులు కట్టేసి కొట్టిన టీచర్.. తమిళనాడు స్కూల్లో ఘటన