పొదుపు, ఆర్థికక్రమశిక్షణ తప్పనిసరి: ప్రధాని మోదీ
ABN , Publish Date - Nov 19 , 2026 | 03:59 PM
ప్రస్తుత తరుణంలో ప్రజలు ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు చర్యలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ గురువారం తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత తరుణంలో ప్రజలు ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు చర్యలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ గురువారం తెలిపారు. ఇష్టారీతిన కాలం గడపడం భారతీయ సంస్కృతి కాదని చెప్పారు. న్యూఢిల్లీలో నేడు జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లల్లో ఎంతో మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. ప్రజలు పొదుపు, ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే మళ్లీ పేదరికంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
2011 నుంచి 2023 మధ్య కాలంలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భం జాతీయస్థాయి వేడుకలకు అర్హమైనదని వ్యాఖ్యానించారు. పేదరికాన్ని తగ్గించడమనేది భారత్ ఎదుర్కొంటున్న సవాలులో ఓ భాగం మాత్రమే అని ప్రధాని అభిప్రాయపడ్డారు. వీరంతా మళ్లీ పేదరికంలోకి జారిపోకుండా మరింత కృషి జరగాల్సి ఉందని చెప్పారు.
2014లో పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో తాను చేసిన ప్రసంగాన్ని కూడా ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పేదల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అంకితమైందని తాను అప్పట్లో అన్నానని తెలిపారు. ఈ దిశగా తీసుకున్న చర్యలు దేశాన్ని అభివృద్ధివైపు నడిపించాయని చెప్పారు.
డ్రగ్స్ పీడ వదిలించాలి..
ఈ సమావేశంలో డ్రగ్స్ సమస్య, అంతర్గత భద్రతకు సంబంధించి అంశాలపై కూడా చర్చ జరిగింది. ఈ సందర్భంగా డ్రగ్స్ సమస్య గురించి మాట్లాడే సమయంలో ప్రధాని మోదీ భావోద్వేగానికి గురైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ సమస్యను మూలాల నుంచి తుడిచిపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం సమిష్టి కృషి అవసరమని అన్నారు. నక్సలిజం విషయంలో నిర్లక్ష్యం వద్దని కూడా సహచర మంత్రులు, అధికారులను ప్రధాని అప్రమత్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీనగర్‌లో మైనస్ 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ధాబాలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురు మృతి