సాయం కాదు..భాగస్వామ్యం కావాలి
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:06 AM
ప్రపంచం ప్రస్తుతమున్న దాత, గ్రహీత విధానం నుంచి పరస్పర ఐక్యత, సమానత్వంతో కూడిన భాగస్వామ్యాల దిశగా మళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
పరస్పర విశ్వాసం, పారదర్శకత పెంపొందించడంపై దృష్టిపెట్టాలి
కొందరి స్వప్రయోజనాల కోసం వాణిజ్యం, టెక్నాలజీ దుర్వినియోగం
దానితో దేశాల మధ్య ‘విశ్వాస లోపం’
హోర్ముజ్ జలసంధి వద్ద భారత నావికులు ప్రాణాలు కోల్పోయారు
నావికుల భద్రత మనందరి బాధ్యత
న్యూఢిల్లీ, జూన్ 16: ప్రపంచం ప్రస్తుతమున్న దాత, గ్రహీత విధానం నుంచి పరస్పర ఐక్యత, సమానత్వంతో కూడిన భాగస్వామ్యాల దిశగా మళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పరస్పర విశ్వాసం, పారదర్శకత పెంపొందించడంపై ప్రపంచదేశాలు దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. హోర్ముజ్ జలసంధి సమీపంలో కొందరు భారత నావికులు ప్రాణాలు కోల్పోయారని.. నావికుల భద్రత ప్రపంచ దేశాల బాధ్యత అని స్పష్టం చేశారు. ఇటీవల హోర్ముజ్ సమీపంలో నౌకలపై అమెరికా బలగాలు దాడులు చేయడంతో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మోదీ దాన్ని ప్రస్తావిస్తూ వారి భద్రత అవసరాన్ని నొక్కిచెప్పారు. అదే సమయంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్ఠంభన, ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. పరస్పర విశ్వాసం, గౌరవం అంశాలను మోదీ ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో ‘కొత్త భాగస్వామ్యాల నిర్మాణం, ప్రపంచ ఐక్యతను పునరుద్ధరించడం’ అంశంపై చర్చలో మోదీ ప్రసంగించారు. ‘‘గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రపంచ సమాజంపై ఎన్నో ఆశలు ఉన్నాయి. సాయం పొందేవారుగా కాకుండా.. ప్రపంచ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాయి. ఇందుకోసం వారికి సహాయం కాదు.. నిజమైన భాగస్వామ్యం కావాలి. దాత-గ్రహీత అనే ఆలోచనను దాటేసి.. సమాన భాగస్వాములుగా పనిచేయాలి. పరస్పర గౌరవంపై భాగస్వామ్యాలు ఉండాలి. కొందరు స్వప్రయోజనాల కోసం వాణిజ్యాన్ని, టెక్నాలజీని దుర్వినియోగం చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ‘విశ్వాస లోపం’ నెలకొంది. ప్రపంచం వనరుల కొరతతో కాదు.. విశ్వాస లోపంతో బాధపడుతోంది. మన భాగస్వామ్యాల భవిష్యత్తు ఈ విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పడంపైనే ఆధారపడి ఉంది.’’ అని మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలపై భారత దృక్పథం ‘వసుధైక కుటుంబం’ అనే తత్వంపై ఆధారపడి ఉందని.. అందరి సంక్షేమమే, అందరి సంతోషమని స్పష్టం చేశారు. భారత్ నేతృత్వం వహిస్తున్న ‘ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్’ వంటివాటిలో మానవతే ప్రథమం అన్న విధానాన్ని అనుసరించిందని వివరించారు. ఉద్రిక్తతలు, యుద్ధాలకు చర్చలు, దౌత్యం, అంతర్జాతీయ సహకారంతోనే పరిష్కారాలు లభిస్తాయని భారత్ విశ్వసిస్తోందని మోదీ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాల్లో పురోగతిని మోదీ స్వాగతించారు. హోర్ముజ్ మూసివేతతో ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడిందని గుర్తు చేశారు. ఆ ప్రాంతంలో ఎందరో భారతీయ నావికులు ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. ప్రపంచ వాణిజ్యాన్ని అనుసంధానం చేస్తున్న నావికులకు భద్రత కల్పించడం, వారిని కాపాడటం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. సుస్థిర, సమ్మిళిత ప్రపంచ అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు.

ట్రంప్ పక్కనే మోదీ..
ఫ్రాన్స్‌లోని ఏవియాన్ లే బాన్ తీరప్రాంత పట్టణంలో 52వ జీ7 సదస్సు మంగళవారం ప్రారంభమైంది. అందులో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీకి ప్రాంగణం వద్ద ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ స్వాగతం పలికారు. సదస్సు వేదిక వద్ద పలు దేశాల అధినేతలతో మోదీ కరచాలనం చేసి, పలకరించారు. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మోదీ మధ్య పలకరింపుగానీ, కరచాలనంగానీ జరగకపోవడం గమనార్హం. తర్వాత సదస్సు వేదిక వద్ద మాత్రం ట్రంప్‌తో మోదీ కరచాలనం చేశారు. జీ7 సదస్సుకు హాజరైన దేశాధినేతలు కలిసి దిగిన ఫొటోషూట్‌లో, సదస్సు వేదికలో ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెండుచోట్లా జీ7 సదస్సును నిర్వహిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పక్కనే ఉన్నారు.
మోదీ వరుసగా ఏడోసారి..
ప్రపంచ జీడీపీ, సైనిక శక్తిలో గణనీయమైన వాటా ఉన్న.. యూఎస్ఏ, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ ఏడు సభ్యదేశాలు, యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో కూడిన కూటమి జీ7. ఈయూ ప్రత్యేక దేశం కాకపోవడం దానిని ‘లెక్కలోకి చేర్చని సభ్యత్వం’ కింద పరిగణిస్తారు. ఏటా జరిగే జీ7 సదస్సుకు పలు కీలక దేశాలను ఆతిథ్య దేశం హోదాలో ఆహ్వానిస్తుంటారు. జీ7 భేటీలో భారత్ ఆతిథ్య దేశంగా పాల్గొనడం ఇది 13వ సారి. ప్రధాని మోదీ జీ7 సదస్సులో పాల్గొనడం ఇది వరుసగా ఏడోసారి కావడం గమనార్హం. ఇక ఈసారి భారత్‌తోపాటు బ్రెజిల్, కెన్యా, దక్షిణ కొరియా ఆతిథ్య దేశాలుగా సదస్సులో పాల్గొన్నాయి.
నేడు ట్రంప్- మోదీ భేటీ
జీ7 సదస్సుకు హాజరైన కెనడా ప్రధాని మెక్ కార్నీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్‌లతో ప్రధాని మోదీ మంగళవారం విడివిడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. బుధవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ భేటీకానున్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం, పశ్చిమాసియా అంశాలు తదితర అంశాలపై వారు చర్చించనున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగిన చర్చల అనంతరం మోదీ, ట్రంప్ ప్రత్యక్షంగా సమావేశం అవుతుండటం ఇదే తొలిసారి.
మళ్లీ ఉక్రెయిన్‌పై ఫోకస్
పశ్చిమాసియా పరిణామాలు ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో.. మళ్లీ ఉక్రెయిన్ వైపు ట్రంప్, జీ7 దృష్టిని మళ్లించేలా ఏవియాన్ సదస్సులో ప్రయత్నాలు జరిగాయి. జీ7 సదస్సులో భాగస్వామ్యం కాకున్నా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఏవియాన్‌కు వచ్చారు. ఉదయం జీ7 నేతల మార్నింగ్ వాక్ సమయంలో వారిని కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో రష్యాపై మరింత ఒత్తిడి పెంచాలని, రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని జీ7 నేతలు నిర్ణయించినట్టు సమాచారం. అలాగే ఉక్రెయిన్‌కు అదనంగా గగనతల రక్షణ వ్యవస్థలు, ఇతర రక్షణ సాయాన్ని అందించాలన్న అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు దౌత్య వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు.. సదస్సు సందర్భంగా ఇక తాను ఉక్రెయిన్‌పై దృష్టిపెట్టాలని అనుకుంటున్నట్టు ట్రంప్ పేర్కొనడం గమనార్హం.