ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేనే!
ABN , Publish Date - Aug 28 , 2026 | 07:19 AM
ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే మళ్లీ ఎన్డీయే కూటమే గెలిచి అధికారంలోకి వస్తుందని.. ఆ కూటమికి 326 సీట్లు.. అందులో 261 సీట్లు బీజేపీకి వస్తాయని ‘ఇండియాటుడే-సీవోటర్’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో వెల్లడైంది.
ఎన్డీయే కూటమికి 326 సీట్లు.. అందులో బీజేపీకి 261 సీట్లు
ఇండీ కూటమికి 185 సీట్లు..
అందులో కాంగ్రెస్‌కు 106
ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయేకి 38.. ఇండియా కూటమికి 41 సీట్లు
ప్రధానిగా మోదీకి 48.7 శాతం.. రాహుల్‌కు 27.1శాతం మంది జై
9.2శాతం మద్దతుతో 3వ స్థానంలో విజయ్
ఇండియాటుడే-సీవోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే మళ్లీ ఎన్డీయే కూటమే గెలిచి అధికారంలోకి వస్తుందని.. ఆ కూటమికి 326 సీట్లు.. అందులో 261 సీట్లు బీజేపీకి వస్తాయని ‘ఇండియాటుడే-సీవోటర్’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో.. ఇండి కూటమికి మరోసారి ఓటమి తప్పదని, ఆ కూటమికి 185 సీట్లే వస్తాయని.. అందులో కాంగ్రెస్‌కు 106సీట్లు వస్తాయని వెల్లడైంది. ప్రధానిగా మోదీకి 58శాతం మంది ఆమోదం ఉందని తేలింది. సర్వేలో పాల్గొన్నవారిలో 48.7శాతం మంది ప్రధానిగా మోదీకి జైకొట్టగా, 27.1శాతం మంది రాహుల్‌కు ఓటేశారు. అనూహ్యం.. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటివారిని దాటేసి 9.2శాతం మంది మద్దతుతో ప్రధాని రేసులో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నిలవడం విశేషం. చూడ్డానికి బీజేపీకి, ఎన్డీయే కూటమికి ఎక్కువ సీట్లు వస్తున్నట్టు కనిపించవచ్చుగానీ.. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు వంటి అంశాల కాణంగా జెన్‌జీలో ప్రబలుతున్న ఆగ్రహం, ఆవేశం, అసహనం ప్రభుత్వంపై గణనీయంగానే పడుతున్నట్టు కూడా ఈ సర్వే ద్వారా వెల్లడైంది.
సర్వే ఫలితాల ప్రకారం..
ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఎన్డీయే కూటమికి 352 సీట్లు.. బీజేపీకి 287 సీట్లు వస్తాయని వెల్లడైంది. కానీ, ఉద్యోగాల కొరత, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలు యువతలో కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచడంతో.. ఎన్డీయే కూటమి సీట్ల సంఖ్య జనవరితో పోలిస్తే తగ్గి 326 సీట్లకు, బీజేపీ 261 సీట్లకు పరిమితమయ్యాయి. ఓట్ల శాతం చూస్తే.. ఎన్డీయేకి ఈ ఏడాది జనవరిలో 47శాతం ఓట్లు వస్తాయని వెల్లడవగా..ఈసారి అది కాస్తంత తగ్గి 45.1 శాతానికి చేరుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి వచ్చింది 44శాతం ఓట్లే.
ఇండి కూటమికి 182, అందులో కాంగ్రెస్‌కు 80 సీట్లు వస్తాయని ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలగా.. ఈసారి ఇండి కూటమి సీట్ల సంఖ్య ఒకింత పెరిగి 185 సీట్లకు, అందులో కాంగ్రెస్ వాటా 106కు చేరడం విశేషం. ఓట్ల శాతం చూస్తే.. ఈ ఏడాది జనవరిలో ఇండికి 39శాతం ఓట్లు వస్తాయని తేలగా.. ఇప్పుడు 39.1 శాతం ఓట్లు వస్తాయని వెల్లడైంది.
ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలుండగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వాటిలో 41 సీట్లు (40శాతం ఓట్లతో) ఇండి కూటమికి.. 38 సీట్లు (42శాతం ఓట్లతో) ఎన్డీయే కూటమికి వస్తాయనివెల్లడైంది.
పంజాబ్‌లో 12 సీట్లకుగాను.. ఇండి కూటమికి 11, ఎన్డీయేకి 1 సీటు వస్తాయని సర్వేలో వెల్లడైంది. ఇక మహారాష్ట్రలో ఎన్డీయే కూటమికి 31 సీట్లు.. ఇంటి కూటమికి 17 సీట్లు వస్తాయని తేలింది. అటు పశ్చిమబెంగాల్‌లో ఎన్టీయే కూటమికి 35, ఇండి కూటమికి 7 సీట్లు వస్తాయని వెల్లడైంది.
దేశంలో పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై నమ్మకం లేదని.. సర్వేలో పాల్గొన్నవారిలో ఏకంగా 67శాతం మంది పేర్కొనడం గమనార్హం.
సర్వేలో ఏకంగా 70.4శాతం మంది జమిలి ఎన్నికల ఆలోచనకు మద్దతుగా ఉంటామనడం గమనార్హం. 24.1 శాతం మంది జమిలికి నో అన్నారు.
ప్రస్తుతానికి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం ఏ రంగానికి ఉండాలి? అనే ప్రశ్నకు.. 23 శాతం మంది విద్య, వైద్యం అని సమాధానమిచ్చారు. 21శాతం మంది మౌలిక సదుపాయాలు, మూలధనవ్యయంపై దృష్టి సారించాలన్నారు. అన్ని రంగాలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని 18శాతం మంది అభిప్రాయపడగా.. సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలని 16శాతం మంది, పన్నులు తగ్గించాలని 8శాతం మంది, సామాజిక సామరస్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాలని 4శాతం మంది అన్నారు.
ఉద్యోగాల కొరతే అతిపెద్ద సమస్య అని సర్వేలో పాల్గొన్న యువతలో 32శాతం మంది అభిప్రాయపడగా.. జీతాలు తక్కువగా ఉన్నాయని 18శాతం మంది, చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకట్లేదని 17శాతం మంది, తాము చదివిన చదువు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలను ఇవ్వలేదని 7శాతం మంది తెలిపారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని అత్యధికంగా 63శాతం మంది అభిప్రాయపడ్డారు.
మోదీ అప్రూవల్ రేటింగ్ ఈ ఏడాది జనవరితో పోలిస్తే 6 పాయింట్లు తగ్గినప్పటికీ.. 58ు మంది ఆమోదం ఆయనకు లభించింది. 51ు మంది ఆయన పనితీరు బాగుందనగా.. 17ు మంది యావరేజ్ అన్నారు. 27ు మంది బాగోలేదన్నారు.
మోదీ.. రాహుల్.. విజయ్
ప్రధాని పదవికి మోదీయే అర్హుడని సర్వేలో పాల్గొన్నవారిలో 48.7శాతం మంది అభిప్రాయపడగా.. రాహుల్‌కు 27.1 శాతం మంది జైకొట్టారు. అనూహ్యంగా.. ఈ రేసులో మమతా బెనర్జీ (2శాతం), అఖిలేశ్ యాదవ్ (1.7శాతం), అరవింద్ కేజ్రీవాల్ (1.2శాతం)ను దాటేసి.. విజయ్ 9.2 శాతం మంది మద్దతుతో మూడో స్థానంలో నిలవడం విశేషం. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను కూడా ఈ జాబితాలో చేర్చగా.. 1.3 శాతం మంది (అంటే కేజ్రీవాల్ కంటే ఎక్కువ) దీప్కేకు ఓటేయడం గమనార్హం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. విపక్ష కూటమికి సారథ్యం వహించడానికి ఎవరు మెరుగైన నాయకుడనే ప్రశ్నకు 29శాతం మంది రాహుల్ పేరు చెప్పగా.. మమతా బెనర్జీ (8.5శాతం), అరవింద్ కేజ్రీవాల్ (7.5శాతం), అఖిలేశ్ యాదవ్ (6.9శాతం)లను వెనక్కి నెట్టి.. 12.2శాతం మంది మద్దతుతో విజయ్ ఈ రేసులో రెండో స్థానంలో నిలవడం గమనార్హం.
సర్వే జరిగిందిలా..
ఇండియాటుడే సంస్థ ఏటా రెండుసార్లు ఈ సర్వే నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది రెండోసారి.. జూలై 1 నుంచి ఆగస్టు 25 నడుమ దేశవ్యాప్తంగా 25,184 మందిని నేరుగా సర్వే చేసింది. గత ఆరు నెలల్లో సీవోటర్ సంస్థ 91,795 మందితో ఇంటర్వ్యూలు నిర్వహించి సేకరించిన డేటాను కూడా పరిగణనలోకి తీసుకుని నివేదికను రూపొందించారు.