‘పీఎం ధార’కు 1.86 లక్షల కోట్లు
ABN , Publish Date - Oct 01 , 2026 | 04:37 AM
పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్‌కు చేర్చే ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలను బలోపేతం చేయడానికి కేంద్రం భారీ పథకం ప్రకటించింది.
గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 కింద రాష్ట్రాల్లో ట్రాన్స్‌మిషన్ విస్తరణ
135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం తరలింపే లక్ష్యం
కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం
రబీ పంటలకు మద్దతు ధరలు పెంపు
కుసుమకు రూ.675, గోధుమకు 25: కేంద్ర మంత్రి వైష్ణవ్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్‌కు చేర్చే ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలను బలోపేతం చేయడానికి కేంద్రం భారీ పథకం ప్రకటించింది. రూ.1.86 లక్షల కోట్ల వ్యయంతో గ్రీన్ ఎనర్జీ కారిడార్(జీఈసీ)-3 కింద పీఎం-ధార (పీఎం-డెవలపింగ్ హార్మనైజ్డ్ అండ్ యాక్సిలరేటెడ్ రెన్యువబుల్-ఎనర్జీ యాక్సెస్) పథకానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదముద్ర వేసింది. ఈ కమిటీ ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైంది. రాష్ట్రాల్లోని ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలను విస్తరించి 135 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను తరలించడం పీఎం-ధార లక్ష్యం. దీంతోపాటు 50 గిగావాట్ అవర్ (జీడబ్ల్యూహెచ్) సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలను ఏర్పాటుచేస్తారని కేంద్ర సమాచార-ప్రసార, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు.మొత్తం రూ.1,86,405 కోట్ల అంచనా వ్యయంలో రూ.1,36,378 కోట్లను జీఈసీ-3 కింద అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ సిస్టమ్స్, రూ.50 వేల కోట్లనుబ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఏర్పాటుకు ఖర్చుచేస్తారు. ఈ పథకానికి కేంద్రం రూ.54,082 కోట్ల ఆర్థిక సాయం చేస్తుంది. 2032-33 నాటికి దీనిని పూర్తిచేస్తారు. 2030నాటికి 500 గిగావాట్లు, 2035నాటికి 900 మెగావాట్ల శిలాజేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యంలో భాగంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అన్ని గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులను టారిఫ్ ఆధారిత కాంపిటీటివ్ బిడ్డింగ్ (టీబీసీబీ) విధానంలో అమలుచేస్తారు. బిల్డ్-ఓన్-ఆపరేట్-మెయింటెయిన్ (బూమ్) పద్ధతిలో ట్రాన్స్‌మిషన్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ ప్రాజెక్టులో భాగస్వాములవుతారు. అలాగే రబీ సీజన్‌లో ఆరు పంటల మద్దతు ధరలను పెంచాలని సీసీఈఏ నిర్ణయించినట్లు వైష్ణవ్ వెల్లడించారు. పప్పుధాన్యాలు, నూనెగింజలకు భారీగా మద్దతు ధర పెంచగా.. గోధుమకు రూ.25 మాత్రమే పెంచారు.
2027-28 రబీ మార్కెటింగ్ సీజన్‌లో మొత్తం రూ.90,962 కోట్ల వ్యయంతో 3.24 కోట్ల టన్నుల పంట ఉత్పత్తులు సేకరించాలని నిర్ణయించినట్లు వైష్ణవ్ తెలిపారు. శనగకు మద్దతు ధర రూ.83 పెరుగనుంది. దీని క్వింటాలు ధర ప్రస్తుతం రూ.5875 నుంచి రూ.5958కి పెంచారు. బార్లీ మద్దతు ధరను క్వింటాలుకు రూ.2150 నుంచి 2286కి.. అంటే రూ.136 పెంచారు. ఎర్రకందిపప్పుపై రూ.390 పెరుగనుంది, దీని క్వింటాలు ధర రూ.7000 నుంచి 7390కి చేరుతుంది. ఇక ఆవాల మద్దతు ధర రూ.413 వరకు పెంచారు. దీని క్వింటాలు ధర రూ.6200 ఉండగా.. రూ.6613కి చేరనుంది. కుసుమ నూనెగింజల మద్దతు ధరను క్వింటాలుకు అత్యధికంగా రూ.7215కి పెంచారు. ప్రస్తుత ధర 6540 కంటే భారీగా రూ.675 పెరుగనుంది, గోధుమ ఉత్పాదక ధర క్వింటాలుకు రూ.1264 మాత్రమేనని.. అయినా దానికి మద్దతు ధరను రెట్టింపు (రూ.2610) చేశామని మంత్రి తెలిపారు. గోధుమ, శనగలపై తక్కువ పెంచడానికి కారణమేంటని విలేకరులు ప్రశ్నించగా.. ఈ ఆరు రబీ పంటలపై కనీసం 50 శాతం మార్జిన్ వచ్చేలా ప్రభుత్వం చేసిందని ఆయన బదులిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
రష్యా సైన్యంలో చేరొద్దు.. భారతీయులకు కేంద్రం హెచ్చరిక
డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడా: ప్రధాని మోదీ.