Share News

విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. ముగ్గురి అరెస్ట్..

ABN , Publish Date - Jul 01 , 2026 | 03:38 PM

తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. ముగ్గురి అరెస్ట్..
Tamil Nadu Politics

ఇంటర్‌నెట్ డెస్క్: తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. టీవీకే ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమిళనాడు ఇంటెలిజెన్స్ అధికారులు ఈ కుట్రపై దర్యాప్తు చేపట్టారు.


ఎమ్మెల్యే ఫిర్యాదుతో కుట్ర వెలుగులోకి..

టీవీకే పార్టీ ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా కొద్దిరోజుల క్రితం చెన్నై పోలీసులను ఆశ్రయించారు. చెన్నైకి చెందిన ఐపీడీఎస్ కన్సల్టెన్సీ ఫామ్‌ ఉద్యోగిపై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో.. ‘తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టమని ఐపీడీఎస్ కన్సల్టెన్సీ ఫామ్‌కు చెందిన వ్యక్తి నాతో చెప్పాడు. అలా చేస్తే 35 కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు. ఈ ఆఫర్‌ గురించి ఎవరితోనూ మాట్లాడవద్దని చెప్పాడు’ అని పేర్కొన్నాడు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో పోలీసులు ఐపీడీఎస్ కన్సల్టెన్సీ ఫామ్‌ ఉద్యోగిని అరెస్ట్ చేశారు.


అతడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, ఈ వ్యవహారంపై తమిళనాడు మంత్రి సీటీ నిర్మల్ కుమార్ స్పందించారు. సెంథిల్ బాలాజీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. ‘సెంథిల్ బాలాజీతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులు ఈ వ్యవహారంలో నేరుగా పాలుపంచుకున్నారు. వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కుట్రలో భాగం అయిన ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేయాలి. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ముగింపు పలకాలి’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో ఇషాన్ కిషన్

పాటల హక్కుల వివాదం.. ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ

Updated Date - Jul 01 , 2026 | 04:09 PM