ఈడీ రెయిడ్స్.. కేరళం మాజీ సీఎం తీవ్ర ఆగ్రహం
ABN , Publish Date - May 27 , 2026 | 04:38 PM
తన నివాసాలపై ఈడీ రెయిడ్స్ వెనుక రాహుల్ గాంధీ ఉన్నారని కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. తనను అరెస్టు చేసే దిశగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: సీఎంఆర్‌ఎల్ కేసులో ఈడీ తన నివాసంలో రెయిడ్స్ నిర్వహించడంపై కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ సోదాల వెనుక రాహుల్ గాంధీ ఉన్నారని ఆరోపించారు. తనను అరెస్టు చేసేందుకు రాహుల్ కుట్రపన్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఈ పని చేస్తున్నాయని మండిపడ్డారు.
నేడు మాజీ సీఎం పినరయి విజయన్, ఆయన కుటుంబసభ్యులకు చెందిన పలు నివాసాల్లో ఈడీ రెయిడ్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. విజయన్ కూతురు వీణా విజయన్‌కు చెందిన ఐటీ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ నుంచి ఎలాంటి సేవలు పొందకుండానే కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) రూ.2.7 కోట్ల నిధులు చెల్లించిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ సోదాలు నిర్వహించింది.
మరోవైపు, ఈ సోదాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పినరయి విజయన్ మద్దతుదారులు నిరసనలకు తెరతీశారు. తిరువనంతపురంలో మాజీ సీఎం నివాసంలో సోదా నిర్వహించి వెళుతున్న ఈడీ అధికారుల వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు వాహనంపై దాడి చేయడంతో కారు అద్దాలు పగిలిపోయాయి. ఈలోపు పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి వాహనాన్ని అక్కడి నుంచి పంపించేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 10 చోట్ల నేడు ఈడీ ఈ రెయిడ్స్‌ను నిర్వహించింది.
ఈ వార్తలనూ చదవండి:
కేరళం మాజీ సీఎం మద్దతుదారుల నిరసన.. ఈడీ వాహనంపై దాడి
బీజేపీతో టచ్‌లో 20 మంది టీఎంసీ ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు