15లోగా పెట్రోల్ ధరల పెంపు!
ABN , Publish Date - May 12 , 2026 | 05:14 AM
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్ 105 డాలర్లు దాటి దూసుకుపోతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని ప్రభుత్వరంగ చమురు సంస్థలు యోచిస్తున్నాయి....
లీటర్‌కు రూ.5 వరకు పెంచే అవకాశం
వంటగ్యాస్ పై సిలిండర్‌కు రూ.50 దాకా?
న్యూఢిల్లీ, మే 11: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్ 105 డాలర్లు దాటి దూసుకుపోతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని ప్రభుత్వరంగ చమురు సంస్థలు యోచిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్... రెండింటి మీద త్వరలో లీటర్‌కు 4-5 రూపాయలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వంట గ్యాస్ ధరలు కూడా సిలిండర్‌కు 40 నుంచి 50 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 15 లోపే పెంపు ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వలు మొత్తాన్ని స్వాధీనం చేసుకొనే వరకు యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ ప్రకటించారు. ఇరాన్ రాజీ ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. అంటే యుద్ధం ఇప్పట్లో ఆగేది కాదు. చమురు నౌకల రాకపోకలకు కీలకమైన హోర్మూజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకొనేది లేదు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ అనిశ్చితికి ప్రపంచ దేశాలు సన్నద్ధం అవుతున్నాయి. భారత ప్రభుత్వం కూడా చమురు ధరల భారాన్ని ప్రజల మీద వేసేందుకు సిద్ధం అవుతోంది. అయితే పెరుగుదల ఒకేసారి కాకుండా దశల వారీగా ఉంటుందని సంకేతాలు వస్తున్నాయి. తొలిదశలో 4-5 రూపాయలు పెంచే అవకాశం ఉంది. ఆ తర్వాత నష్టం పూడే వరకు రూ.2-4 చొప్పున పెంచుకుంటూ వెళ్తారు. ప్రస్తుతం ప్రభుత్వరంగ చమురు సంస్థలకు నెలకు రూ.30 వేల కోట్లు నష్టం వస్తోంది. ముడి చమురు ధరలు మరింత పెరిగితే ఈ నష్టం మరింత అధికంగా ఉంటుంది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో 85ు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దాంతో ప్రపంచంలో ఏ చమురు ఉత్పత్తి దేశానికి సంక్షోభం వచ్చినా భారత్ మీద ప్రభావం పడుతోంది. నష్టాలను పూడ్చుకొనేందుకు ఒకేసారి భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటుందని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే, పెంపుదల దశలవారీగా చేపడతారు. పెట్రోల్ ధరలు పెరిగితే రవాణా చార్జీలు పెరుగుతాయి. ఫలితంగా అన్నింటి ఽధలు పెరుగుతాయి. మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావం ఉంటుంది. ఆయిల్ ధరలు పెరగడం, రూపాయి పతనంతో దిగుమతి ఖర్చు పెరగడంతో భారత్‌పై డబుల్ ఇంపాక్ట్ పడుతోంది.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..
సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్