పెట్రో ధరలు మరో 10 పెంపు?
ABN , Publish Date - May 17 , 2026 | 05:02 AM
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం సగటున రూ. 3 పెంచిన చమురు కంపెనీలు.. సమీప భవిష్యత్తులో మరింత పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఒకేసారి లేదా 2, 3 వారాల్లో దశలవారీగా
నష్టాల భర్తీకి పెంచే యోచనలో కంపెనీలు
నిపుణుల అంచనా.. ద్రవ్యోల్బణంపై హెచ్చరిక
న్యూఢిల్లీ, మే 16: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం సగటున రూ. 3 పెంచిన చమురు కంపెనీలు.. సమీప భవిష్యత్తులో మరింత పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. చమురు సంస్థల నష్టాల భర్తీకి పెట్రోల్, డీజిల్ ధరలను మరో రూ. 10 మేర పెంచాల్సి రావొచ్చని అంటున్నారు. పశ్చిమాసియా యుద్ధం ముగింపుపై చర్చలు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా దేశీయంగా కూడా ధరలు పెంచకపోతే చమురు సరఫరా సంస్థల నష్టాలు మరింత పెరుగుతాయని ‘ఎంకే గ్లోబల్’ ఆర్థిక విశ్లేషకులు పేర్కొన్నారు. అంతకుముందు మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఇంధన దిగుమతులపై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 10 మేర తగ్గించినప్పటికీ.. కంపెనీలు విక్రయించే ప్రతి లీటరు ఇంధనంపై రూ. 17 నుంచి 18 వరకు నష్టపోతున్నాయని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 10 డాలర్ల మేర పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణంతో పాటు కరెంటు ఖాతా లోటు కూడా 0.3 శాతం మేర పెరుగుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జీడీపీ కుదింపునకు సంబంధించిన అంచనాలు కూడా వెలువడడం మొదలైందని చెబుతున్నారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం 0.15 శాతం నుంచి 0.25 శాతం వరకు పెరగచ్చని తెలిపారు. మరోవైపు ఇంధన ధరల పెరుగుదలతో పాటు, వంటగ్యాస్, పాల ధరలు కూడా పెరగడం వల్ల ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరగొచ్చన్నారు. ఇంధన ధరలు, పాల ధరల పెరుగుదల వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం 0.42 శాతం మేర పెరిగి సామాన్యుడిపై భారం పడొచ్చని హెచ్చరిస్తున్నారు.