పెట్రోల్, డీజిల్‌పై బాదుడు
ABN , Publish Date - May 16 , 2026 | 04:05 AM
దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచారు. చమురు కంపెనీలు లీటరుకు రూ.3 చొప్పున ధరలను పెంచాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి.
లీటరుకు రూ.3 చొప్పున.. నాలుగేళ్ల తర్వాత పెరిగిన ధర
కిలోకు రూ.2 పెరిగిన సీఎన్‌జీ
అయినా తీవ్ర నష్టం: కంపెనీలు
ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం
ప్రధాని మోదీ తప్పునకు ప్రజల మూల్యం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ, మే 15: దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచారు. చమురు కంపెనీలు లీటరుకు రూ.3 చొప్పున ధరలను పెంచాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చమురు కంపెనీలు పేర్కొన్నాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.94.77 ఉండగా అది రూ.97.77కు చేరింది. డీజిల్ ధర 87.67 ఉండగా రూ.90.67కు పెరిగింది. వివిధ రాష్ట్రాలు వసూలు చేస్తున్న వ్యాట్ ఆధారంగా ధరలు మారతాయి. దీని ప్రకారం తెలంగాణలో లీ టరు పెట్రోలుపై రూ.3.39; డీజిలుపై రూ.3.26 పెరగనున్నాయి. ఫలితంగా, ఇప్పటి వరకూ లీటరు పె ట్రోలు రూ.107.50 ఉన్న ధర తాజాగా రూ.110.89కి; రూ.95.70 ఉన్న లీటరు డీజిల్ ధర రూ.98.96కు చేరింది. అలాగే, విజయవాడలో రూ.109.76 ఉన్న లీటరు పెట్రోలు ధర 113.03 (పెంపు 3.29) రూపాయలకు చేరగా.. రూ.97.07 ఉన్న లీటరు డీజిల్ ధర రూ.100.22కు పెరిగింది. ఇక, సీఎన్‌జీ ధర కూడా కిలోకు రూ.2 చొప్పున పెరిగింది. ఢిల్లీలో కేజీ సీఎన్‌జీ రూ.79.09 కాగా, ముంబైలో రూ.84కు చేరింది. కాగా, గృహ వినియోగ ఎల్‌పీజీ సహా పీఎన్‌జీ ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి.
అత్యంత స్వల్ప ఊరటే: కంపెనీలు
పెట్రోలు, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచినా.. తాము భారీస్థాయిలో నష్టాలు భరించాల్సి వస్తోందని చమురు కంపెనీలు చెబుతున్నాయి. లీటరు పెట్రోల్‌పై రూ.11, డీజిల్‌పై రూ.39 చొప్పున తమకు నష్టాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నాయి. ఐసీఆర్‌ఏ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత వశిష్ట్ మాట్లాడుతూ.. ధరల పెంపుతో కంపెనీలకు అత్యంత స్వల్ప ఊరట మాత్రమే లభిస్తుందన్నారు. గత పదేళ్లతో పోలిస్తే.. కంపెనీలకు రోజుకు సగటున రూ.500 కోట్ల మేరకు నష్టం వస్తోందని పేర్కొన్నారు. చమురు ధరలు నియంత్రణలోకి రాకపోతే.. మార్కెటింగ్ కంపెనీలు ధరలను మరోసారి సమీక్షించాల్సి ఉంటుందన్నారు.
ఎన్నికలు ముగియగానే పెంపు
ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో ముడి చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడి.. ధరలు 50శాతం మేరకు పెరిగాయి. అయినప్పటికీ ఆ భారాన్ని తామే భరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్ల కిందట పేర్కొంది. కానీ, కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన పదిరోజుల్లోనే ధరలను పెంచడం పట్ల రాజకీయ పక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. కాగా, 2022, మే తర్వాత దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినా, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు లీటరుకు రూ.2 చొప్పున తగ్గించారు. ఇక, 14కేజీల వంటగ్యాస్ సిలిండర్‌పై ఇప్పటికే రూ.60 చొప్పున పెంచిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపైనా కంపెనీలకు రూ.674 చొప్పున నష్టం వస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కాగా, పెట్రోల్ ఎగుమతు లపై వసూలు చేసే పన్నులను కేంద్రం ఒక్కసారిగా పెంచేసింది. లీటరు పెట్రోల్‌పై ఏకంగా రూ.3 చొప్పున అదనపు పన్ను వసూలు చేస్తామని ప్రకటించింది. మరోపక్క, డిజీల్‌పై వసూలు చేసే పన్నును లీటరుకు రూ.23 నుంచి రూ.16.5కి తగ్గించింది.
ద్రవ్యోల్బణంపై ప్రభావం
చమురు ధరల పెంపు ప్రభావం ద్రవ్యోల్బణంపై పడుతోందని వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) పేర్కొంది. గత మార్చిలో ద్రవ్యోల్బణం 3.40 శాతం ఉండగా ఏప్రిల్‌లో ఇది 3.48 శాతానికి చేరింది. హోల్‌సేల్ ధరల ద్రవ్యోల్బణం కూడా 42 నెలల గరిష్ఠానికి చేరి 8.3 శాతంగా కొనసాగుతున్నట్టు వివరించింది. చమురు ధరల పెంపుతో అన్ని రంగాలపైనా పరోక్ష ప్రభావం కనిపిస్తుందని పేర్కొంది.
అసమర్థ పాలన: కాంగ్రెస్
దేశంలో చమురు ధరలు పెరగడంపై విపక్షాలు మండిపడ్డాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని పలు నాయకులు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ స్పందిస్తూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన తప్పునకు ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికి రూ.3 షాకే తగిలిందని.. మిగిలిన ‘వసూళ్లు’ కూడా ఉంటాయన్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. నాయకత్వ సంక్షోభానికి, దూరదృష్టి లోపానికి ఈ ధరల పెంపు నిదర్శనమన్నారు. పెంచిన ధరలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా డిమాండ్ చేశారు.