2, 3 నెలల తర్వాతే పెట్రో ధరల తగ్గింపు
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:35 AM
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించే పరిస్థితి లేదని కేంద్ర పెట్రోలియం శాఖ...
అదీ ముడిచమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితేనే..
కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురి
న్యూఢిల్లీ, జూలై 2: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించే పరిస్థితి లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి స్పష్టం చేశారు. కనీసం మరో 2, 3 నెలల పాటు ముడిచమురు ధరలు ఇదేస్థాయిలో కొనసాగితేనే ధరల తగ్గింపుపై పునఃసమీక్షించే అవకాశం ఉందన్నారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత రిఫైనరీలు రెండు నెలల క్రితం అధిక ధరలకు కొనుగోలు చేసిన చమురునే శుద్ధి చేస్తున్నాయని చెప్పారు. ‘‘తగ్గిన ప్రస్తుత ముడిచమురు ధరలు మరో 2, 3 నెలలు ఇలాగే కొనసాగితే అప్పుడు పరిస్థితిని సమీక్షిస్తాం. అయితే ధరలు తగ్గుతాయని ఇప్పుడే చెప్పడం ఊహాజనితమే అవుతుంది’’ అని మంత్రి అన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ, దేశీయ ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఆ భారాన్ని ప్రజలపై వేయలేదని తెలిపారు. దీంతో అవి జూన్ నెలాఖరు నాటికి రూ. 74,781 కోట్ల మేరకు నష్టపోయాయని వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో పెట్రోల్ ధరలు అభివృద్ధి చెందిన దేశాల్లో 20శాతం, భారత పొరుగు దేశాల్లో 35శాతం వరకు పెరిగితే.. భారత్‌లో 5.58శాతం మాత్రమే పెరిగాయని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి
టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు
కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది