Share News

ఖేరాకు ముందస్తు బెయిల్‌’

ABN , Publish Date - May 02 , 2026 | 06:28 AM

కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అస్సాం సీఎం హిమంతబిస్వశర్మ భార్య రినికి భూయాన్‌పై నిరాధార ఆరోపణలు చేశారనే...

ఖేరాకు ముందస్తు బెయిల్‌’

  • అస్సాం సీఎం హిమంత భార్య మీద ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు మంజూరు

  • ఎన్నికల వేళ విమర్శల ఆధారంగా వ్యక్తిగత స్వేచ్ఛను హరించొద్దని వ్యాఖ్య

న్యూఢిల్లీ, మే 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అస్సాం సీఎం హిమంతబిస్వశర్మ భార్య రినికి భూయాన్‌పై నిరాధార ఆరోపణలు చేశారనే కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రినికి భూయాన్‌కు విదేశీ పాస్‌పోర్టులు, విదేశాల్లో అక్రమ ఆస్తులు ఉన్నాయని.. ఆ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో హిమంత వెల్లడించలేదని పవన్‌ ఖేరా ఆరోపించారు. ఇవి తప్పుడు ఆరోపణలని రినికి ఫిర్యాదు చేయటంతో ఖేరాపై అస్సాంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏప్రిల్‌ 7న ఢిల్లీలోని ఖేరా నివాసానికి పోలీసులు వెళ్లినప్పటికీ ఆయన అక్కడ అందుబాటులో లేరు. ఈ క్రమంలో ఖేరా తొలుత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, ఏప్రిల్‌ 10న వారం రోజుల పాటు ట్రాన్సిట్‌ ముందస్తు బెయిల్‌ లభించింది. దీనిపై అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆ బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. అనంతరం సుప్రీంకోర్టు సూచన మేరకు ఖేరా గౌహతి హైకోర్టును ఆశ్రయించగా నిరాశ ఎదురైంది. గౌహతి హైకోర్టు తీర్పును ఖేరా సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పవన్‌ ఖేరా తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదిస్తూ.. రాజకీయ ప్రచారంలో భాగంగా చేసిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా అరెస్టులు చేయడం సమంజసం కాదని కోర్టుకు విన్నవించారు. అస్సాం ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ వాదనలను తోసిపుచ్చారు. పత్రికా సమావేశంలో ఖేరా ప్రదర్శించిన పత్రాలు నకిలీవని తేలిందని చెప్పారు. ఆ పత్రాలను ఎవరు, ఎక్కడ తయారు చేశారు? అనే అంశాలను వెలికి తీయాలంటే కస్టడీ విచారణ తప్పనిసరని వాదించారు.


వ్యక్తిగత స్వేచ్ఛ అత్యంత విలువైనది

విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం సరికాదని అభిప్రాయపడింది. ఎన్నికల సమయంలో రాజకీయ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమని గుర్తు చేసింది. అస్సాం సీఎం హిమంత సైతం పవన్‌ ఖేరాపై బహిరంగ ప్రకటనలు చేశారని, దీన్ని బట్టి ఈ వివాదానికి రాజకీయ రంగు ఉందని స్పష్టమవుతోందని తెలిపింది. వ్యక్తిగత స్వేచ్ఛను అత్యంత విలువైన ప్రాథమిక హక్కుగా ధర్మాసనం అభివర్ణించింది. పవన్‌ ఖేరాకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. న్యాయస్థానం అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతు విధించింది. తాము చేసిన వ్యాఖ్యలు ముందస్తు బెయిల్‌ మంజూరుకు మాత్రమే పరిమితమని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు

భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌‌ను తోసిపుచ్చిన ఈసీ

Updated Date - May 02 , 2026 | 06:29 AM