Share News

పాక్ కుట్ర.. ఉగ్రవాదులకు సాయంగా భారత్‌లోకి టెలికం సిగ్నల్స్

ABN , Publish Date - May 31 , 2026 | 06:16 PM

భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రేరేపించే పాక్ వారికి సాయంగా అక్రమ టెలికం సిగ్నల్స్‌ను ప్రసారం చేస్తోంది. ఇవి జమ్మూ వరకూ చొచ్చుకొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

పాక్ కుట్ర.. ఉగ్రవాదులకు సాయంగా భారత్‌లోకి టెలికం సిగ్నల్స్
Pak Illegal Cell Network in India

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రేరేపించే పాక్ వారికి సాయంగా అక్రమ టెలికం సిగ్నల్స్‌ను ప్రసారం చేస్తోంది. భారత నిఘా వర్గాలకు చిక్కకుండా సమాచార మార్పిడిలో సాయపడేందుకు ఈ సిగ్నల్స్‌ను భారత్‌లోకి ప్రసారం చేస్తోందని అధికారులు జాతీయ మీడియాకు తెలిపారు. ఇవి జమ్మూ వరకూ చొచ్చుకొస్తున్నట్టు చెప్పారు.

ఈ దిశగా నియంత్రణ రేఖకు అత్యంత సమీపంలో వ్యూహాత్మక ప్రాంతాల్లో పాక్ సెల్ టవర్స్‌ను ఏర్పాటు చేసుకుంది. వీటి ద్వారా ప్రసారమయ్యే సిగ్నల్స్ జమ్మూలోని జైళ్ల వరకూ చేరుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కశ్మీర్‌లోని పర్వత ప్రాంతాలు ఈ సిగ్నల్స్‌ను అడ్డుకుంటున్నప్పటికీ జమ్మూ మైదాన ప్రాంతాల మీదుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ సిగ్నల్స్ భారత్‌లోకి చొచ్చుకొస్తున్నాయి.


ఈ టవర్స్‌లో ప్రామాణిక జీఎస్ఎమ్ టెక్నాలజీకి బదులు సీడీఎమ్ఏ సాంకేతికతను వాడారని భారత అధికారులు చెప్పారు. స్మార్ట్ ఫోన్స్, రేడియో సెట్స్ అనుసంధానించి ఎన్‌క్రిప్టెడ్ విధానంలో సమాచారం పంపించే వైఎస్ఎమ్ఎస్ సర్వీసుకు (చైనా తయారీ వ్యవస్థ) అనువుగా ఈ టవర్స్‌ను పాక్ ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. ఫలితంగా భారతీయ సిగ్నల్స్, సిమ్ కార్డుల అవసరం లేకుండానే పాక్‌ హ్యాండ్లర్లు భారత్‌లోని ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతారని చెబుతున్నారు.


అంతర్జాతీయ టెలికం నిబంధనల ప్రకారం, ఒక దేశానికి చెందిన సెల్యులర్ సిగ్నల్స్ సరిహద్దు దాటి 500 మీటర్లకు మించి పొరుగు దేశంలోకి వెళ్లకూడదు. అయితే, భారత్‌లోని కథువా, రాజౌరీ, పూంఛ్‌ వంటి సరిహద్దు జిల్లాలతో పాటు జమ్మూ నగరానికి ఉత్తరాన 15 కిలోమీటర్ల దూరంలోని కోట్‌బాల్వాల్ జైలు వరకూ పాక్ సిగ్నల్స్ ఆనవాళ్లను గుర్తించామని అధికారులు చెప్పారు. అక్రమ సిగ్నల్స్‌ను అడ్డుకునేందుకు జైళ్ల వద్ద ఉన్న కొన్ని జామర్లు ఈ సిగ్నల్స్‌ను అడ్డుకోలేకపోతున్నాయని అధికారులు తెలిపారు. వీటిని అడ్డుకునే కొత్త తరం జామర్ల అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. అయితే, 2019-20 పాక్ చేసిన ఇలాంటి ప్రయత్నాలను భారత్ దీటుగా ఎదుర్కొందని చెప్పారు. ప్రస్తుతం పాక్ ప్రయత్నాలకు అదే గతి తప్పదని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయ్.. ఓఎస్‌ఎం కాంట్రవర్సీపై సీబీఎస్‌ఈ స్పందన

యూపీలో ఎన్‌కౌంటర్.. టీనేజర్ హత్య కేసులో నిందితుడి మృతి

Updated Date - May 31 , 2026 | 06:47 PM